కరోనా మహమ్మారి కుటుంబ సభ్యుల మధ్య దూరాన్ని పెంచుతోంది.పాజిటివ్ వచ్చిందని తెలిసిన మరుక్షణం నుంచే ఇరుగుపొరుగు వారు కనీస సాయం చేయడానికి వెనుకాడుతున్నారు. కోలుకున్న తర్వాత కూడా మాట్లాడటానికి సంకోచిస్తున్న సమయమిది. వైరస్ సోకి ఓ కుటుంబంలో మరణం సంభవించిందని తెలిస్తే మృతదేహం తీసుకోవడానికి కూడా ముందుకు రాని కాలమిది. కొందరు కుటుంబ సభ్యులైతే ఆసుపత్రుల్లోనే మృతదేహాలను వదిలేస్తున్నారు. మరికొందరు దూరంగా నిలుచొని అయిన వారి అంత్యక్రియలను తిలకిస్తున్నారు. కుటుంబసభ్యులే కాదనుకున్నా కొందరు మాత్రం కరోనాతో చనిపోయిన వ్యక్తులకు సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు చేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు.
తొలివేవ్‌లో 86..ఇప్పుడు 50
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ద్వారా మొదట వైద్య శిబిరాలు, విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వడం ప్రారంభించాం. చెన్నైలో వరదలు వచ్చినప్పుడు పుంగనూరు నుంచి వెళ్లి.. స్థానికులకు సాయం చేశాం. కరోనా తొలి వేవ్‌లో పుంగనూరుకు చెందిన ఓ వ్యక్తి తిరుపతిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. మృతదేహాన్ని ఇవ్వడం కుదరదని సిబ్బంది చెప్పడంతో ఆ కుటుంబసభ్యులు వచ్చి కన్నీరు పెట్టుకున్నారు. దీంతో అన్ని జాగ్రత్తలు తీసుకొని అంత్యక్రియలు చేస్తామని అప్పటి కలెక్టర్ భరత్‌గుప్తాకు విన్నవించాం. అనుమతులు రాగానే కార్యక్రమాన్ని ప్రారంభించాం. తొలి వేవ్‌లో 86, ఇటీవల మరో 50 మృతదేహాలకు అంత్యక్రియలు చేశాం. మా బృందంలో అన్వర్ బాషా, ఖదీర్, నజీర్, ఖమ్రుద్దీన్ తదితరులతో కలుపుకొని 25 మంది సభ్యులున్నారు. జిల్లాలో ఎక్కడికి వెళ్లైనా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దూరంగా నిలబడి చివరి చూపు చూస్తున్న మృతుల పిల్లలు, అమ్మానాన్నలు, జీవిత భాగస్వామిని చూస్తున్న సందర్భాల్లో ఒక్కోసారి కన్నీళ్లు వస్తున్నాయి. ప్రస్తుతం రోజుకు కనీసం నాలుగైదు మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తున్నాం. ఇప్పటివరకూ మా బృందంలో ఒక్కరికి కూడా మహమ్మారి సోకలేదు. 98498 89984 నంబరు ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు. - చాంద్ బాషా, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా