ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ)గా సీఎం ముఖ్య సలహాదారు, మాజీ సీఎస్ నీలం సాహ్ని నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమె పేరును ఆమోదించారు. ఈనెల 31తో ప్రస్తుత ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త ఎస్‌ఈసీ ఎంపిక కోసం ముగ్గురు విశ్రాంత ఐఏఎస్ అధికారుల పేర్లతో కూడిన దస్త్రాన్ని ప్రభుత్వం గవర్నర్‌కు పంపింది. వీరికి సంబంధించిన వార్షిక రహస్య నివేదికలను గవర్నర్ తెప్పించుకొని పరిశీలించినట్లు తెలిసింది. శ్యాముల్పై కేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్ పెండింగ్ ఉన్నట్లు నివేదిక ద్వారా గవర్నర్ గుర్తించినట్లు సమాచారం. ప్రేమ్ చంద్రారెడ్డికి సంబంధించిన మూడు, నాలుగేళ్ల నివేదికలు అందుబాటులో లేకపోవటంతో ఆయన పేరును కూడా పక్కన పెట్టినట్లు తెలిసింది. నీలం సాహ్ని నివేదికలన్నీ ఉండటం, ఎలాంటి కేసులు లేకపోవటంతో ఎస్ఈసీగా ఆమె పేరును ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆమె ఏప్రిల్ 1న ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఏపీ నూతన ఎస్‌ఈసీగా నీలం సాహ్ని - ఏపీ ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని
20:55 March 26
ఏప్రిల్ 1న ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టనున్న నీలం సాహ్ని
నీలం సాహ్ని గతంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా పనిచేశారు. సీఎస్‌గా పదవీ విరమణ అనంతరం సీఎం ముఖ్యసలహాదారుగా ప్రభుత్వం నియమించింది. 1984 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన నీలం సాహ్ని.. ఉమ్మడి రాష్ట్రంలో పలు బాధ్యతలు నిర్వర్తించారు. మచిలీపట్నం అసిస్టెంట్ కలెక్టర్‌గా, టెక్కలి సబ్‌కలెక్టర్‌గా, నల్గొండ జేసీగా పనిచేశారు. ఆ తర్వాత పలు ప్రభుత్వ శాఖల్లో కార్యదర్శి హోదాలో విధులు నిర్వర్తించారు. అనంతరం కేంద్ర సర్వీసులకు వెళ్లిన ఆమె.. ఆ తర్వాత ఏపీ సీఎస్‌గా నియమితులయ్యారు.
త్వరలోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం పరిషత్ ఎన్నికలు నిర్వహించేలా తగు చర్యలు తీసుకోనున్నారు.
ఇదీ చదవండి:
విద్యాశాఖలో ఉద్యోగాల భర్తీకి త్వరలో క్యాలెండర్: మంత్రి సురేశ్