ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పెళ్లైన రెండో రోజే వరుడి ఆత్మహత్య.. ఏం జరిగింది..? - వైరాలో నవ వరుడి ఆత్మహత్య

Newly Wed Groom Suicide : పెళ్లిచూపుల్లో అమ్మాయిని చూడగానే నచ్చింది. వెంటనే ముహూర్తం.. ఆ వెంటనే నిశ్చితార్థం.. వివాహం జరిగిపోయాయి. వివాహ వేడుక అనంతరం రిసెప్షన్‌లో ఆ వరుడు ఎంతో సంబురంగా డ్యాన్స్ చేశాడు. మరుసటి రోజు దైవ దర్శనానికి వెళ్దామని తెల్లవారుజామునే ఇంట్లో వాళ్లని, బంధువులను నిద్రలేపాడు. అందర్నీ త్వరగా రెడీ అవ్వమని చెబుతూ.. స్నానం చేసి వస్తానని బాత్‌రూంలోకి వెళ్లాడు. అంతా రెడీ అయి వాహనాల వద్దకు చేరుకునే సరికి వరుడు కనిపించలేదు. ఇప్పటిదాకా తమను తొందరపెట్టి ఎక్కడికి వెళ్లాడని ఇల్లంతా గాలించారు. స్నానం చేసి వస్తానని చెప్పిన మాట గుర్తొచ్చి స్నానాల గదిలో చూసేసరికి రక్తపు మడుగులో కనిపించాడు ఆ నవ వరుడు. ఇంతకీ ఏమైంది?

కమ్మంపాటి నరేశ్‌
కమ్మంపాటి నరేశ్‌

By

Published : Jun 7, 2022, 11:02 AM IST

Newly Wed Groom Suicide in Khammam : పెళ్లింట పెను విషాదం. వివాహమైన రెండో రోజే నవ వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దైవ దర్శనానికి వెళ్లే క్రమంలో అందర్నీ తెల్లవారుజామునే నిద్రలేపి.. తాను మాత్రం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా వైరా మండలంలో సోమవారం వేకువజామున ఈ విషాదం జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం..వైరా మండలం పుణ్యపురం గ్రామానికి చెందిన కమ్మంపాటి నరేశ్‌(29)కు, ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా గంపలగూడెం మండలం ఆర్లపాడుకు చెందిన యువతితో ఈ నెల 4న వివాహం జరిగింది. తర్వాత రోజు ఆదివారం వరుడి స్వగ్రామంలో రిసెప్షన్‌ నిర్వహించారు. ఆ వేడుకలోనూ నరేశ్‌ సంతోషంగా గడిపాడు. సహచరులతో కలిసి నృత్యం చేశాడు. వధూవరులు, దగ్గరి బంధువులు సోమవారం ఉదయం విజయవాడ సమీపంలోని గుణదలకు దైవదర్శనానికి వెళ్లాలని నిశ్చయించుకున్నారు. అందుకోసం నరేశ్‌ అద్దె కార్లు మాట్లాడాడు.

Newly Wed Groom Suicide in Punyapuram : తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్రలేచి..బంధువులందర్నీ లేపాడు. స్నానంచేసి వస్తానంటూ గదిలోకి వెళ్లాడు. బంధువులు ప్రయాణ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. బయల్దేరే సమయం వచ్చినా నరేశ్‌ కన్పించకపోవడం, ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో స్నానాల గది తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లారు. రక్తపు మడుగులో కన్పించడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. బ్లేడుతో చెయ్యి, గొంతు కోసుకుని మరణించినట్టు గుర్తించారు.

తల్లి రెక్కల కష్టంతో.. నరేశ్‌ తల్లి నాగమ్మ ఆశా కార్యకర్త. భర్త నాగేశ్వరరావు కొన్నేళ్ల క్రితమే చనిపోగా, ఆమె తన రెక్కల కష్టంతో కుమార్తె, ఇద్దరు కుమారులను పోషిస్తున్నారు. పెద్ద కుమారుడికి వివాహమైంది. చిన్న కుమారుడు నరేశ్‌ ఆరేళ్ల క్రితమే బీటెక్‌ పూర్తిచేశాడు. ప్రైవేటు ఉద్యోగం చేస్తూనే గ్రూప్స్‌కు శిక్షణ తీసుకున్నాడు. పెళ్లి కుదిరిన నేపథ్యంలో కొద్ది రోజులుగా ఇంటి వద్దనే ఉంటున్నాడు. పెళ్లికి ముందు, తర్వాత బంధువులు, సన్నిహితులతో సంతోషంగానే గడిపిన అతను ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డాడనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details