తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పీఠంపై పార్టీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గతంలో సీల్డ్ కవర్‌లో పీసీసీ అధ్యక్షుల పేర్లు వచ్చేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులకు తావులేదు. పారదర్శకతకు పెద్ద పీట వేస్తున్నట్లు చెబుతున్న కాంగ్రెస్ అధిష్ఠానం రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ కొత్త తరహాలో చేపట్టింది. రాష్ట్రంలో ఉన్న తాజా రాజకీయ పరిస్థితులను అధిగమించి.. పార్టీని బలోపేతం చేయగలిగే నాయకత్వం కోసం అన్వేషణ చేస్తోంది. ఇటీవల గ్రేటర్‌లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ.. ఉత్తమ్ కమార్ రెడ్డి పీసీసీకి గుడ్‌బై చెప్పడం వల్ల నూతన అధ్యక్షుడి ఎంపిక అనివార్యమైంది.
కోమటిరెడ్డి, రేవంత్‌రెడ్డి మధ్యే పోటీ..
ఏఐసీసీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్ హైదరాబాద్ వచ్చి నాలుగు రోజులు ఇక్కడే మకాం వేసి అభిప్రాయాలు తెలుసుకున్నారు. పీసీసీ కార్యవర్గం, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇంఛార్జులు, వివిధ అనుబంధ విభాగాల అధిపతులకు చెందిన మొత్తం 162 మంది నుంచి అభిప్రాయాన్ని సేకరించారు. ఇందుకు సంబంధించిన నివేదికను కూడా కాంగ్రెస్ అధిష్ఠానానికి నివేదించారు. డజన్‌కు పైగా మంది పీసీసీ కోసం పోటీ పడుతుండగా.. అభిప్రాయ సేకరణతో వారంతా పక్కకుపోయి.. ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డిల మధ్యనే పోటీ నెలకొన్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
రేవంత్‌రెడ్డికే మద్దతు...
రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ స్థితిగతులతోపాటు అధికార తెరాసను తట్టుకుని భాజపా దూకుడుకు కళ్లెం వేయడం పాటు పార్టీలో చీలికలు రాకుండా చూసుకునే సత్తా కలిగిన వ్యక్తికే పీసీసీ ఇవ్వాలని అధిష్ఠానం భావిస్తోంది. ఇదే సమయంలో నాయకుల అభిప్రాయసేకరణలో ఎంపీ రేవంత్ రెడ్డికి అనుకూలంగానే ఎక్కువ మంది మద్దతు ప్రకటించినట్లు గాంధీభవన్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇదే విషయం కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి కూడా సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పట్టు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీని తిరిగి బతికించేందుకు రేవంత్ రెడ్డి లాంటి దూకుడుగా ఉన్న నాయకుడు కావాలని పలువురు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
ఏకాభిప్రాయానికే ఓటు...
గడిచిన కొన్ని నెలలుగా రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీలో చర్చ కొనసాగుతోంది. తాజాగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాజీనామాతో... తిరిగి పీసీసీ ఎంపిక వ్యవహారం తెరపైకి వచ్చి... ప్రక్రియ కూడా కొనసాగుతోంది. దిల్లీ వెళ్లి లాబీయింగ్ చేసుకొనేందుకు అవకాశం లేకుండా..రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్ అడ్డుకట్ట వేశారు. అభిప్రాయ సేకరణ ద్వారా కాదని... ఏకాభిప్రాయం వచ్చేట్లు చూడాలని కొందరు సీనియర్లు అధిష్ఠానానికి లేఖలు రాశారు. బయట పార్టీ నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెట్టవద్దని... మొదటి నుంచి పార్టీ కోసం పని చేస్తున్న వారికే ఇవ్వాలని కోరారు. గతంలో పార్టీ విధేయుల ఫోరం పేరుతో... ఏఐసీసీకి రెండు లేఖలు కూడా రాశారు. పార్టీ సీనియర్ నేత వి.హనుమంతురావు కూడా బీసీలకే పీసీసీ అధ్యక్ష పీఠం ఇవ్వాలని లేఖ రాశారు.
ఏ క్షణంలోనైనా ప్రకటన...
బంతి కాంగ్రెస్ అధిష్ఠానం కోర్టులో ఉండడం వల్ల... తుది నిర్ణయం ఏ క్షణంలోనైనా ప్రకటిస్తారని పార్టీకి చెందిన నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ముగ్గురు ఎంపీలు, సీఎల్పీ నేతలు దిల్లీలో ఉండటం వల్ల ఏఐసీసీ వద్ద పీసీసీ వ్యవహారం చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకట్రెండు రోజుల్లో ప్రకటన రానట్లయితే... వచ్చే ఏడాది మొదటి వారంలో వెలువడే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఇదీ చూడండి: