విద్య, వైద్యం. ఈ రెండు రంగాలపైనా ఎంతో ప్రభావం చూపించింది కరోనా. విద్యా రంగంలో పెనుమార్పులు వచ్చాయి. విద్యార్థులు సాంకేతికతతో స్నేహం చేశారు. ఉపాధ్యాయుల సమక్షంలో, తరగతి గదిలోనే వారికి చదువు అబ్బుతుందని విశ్వసించారు. పాఠాలు అంటే నేరుగా చెబితేనే బాగుంటుందన్న అభిప్రాయాన్నీ మార్చేసింది కరోనా.
ఎక్కడైనా పాఠాలు...
వైరస్ ముప్పు పొంచి ఉండటం వల్ల విద్యా సంస్థలు నెలల పాటు తెరుచుకోలేదు. ఆన్‌లైన్ బోధన ప్రారంభమైంది. పాఠశాలలు లేవు. పిల్లల భవిష్యత్తు ఎలా? అని తల్లిదండ్రులు కొంత బాధపడినా, కొవిడ్ బారినపడటం కంటే ఇంట్లో ఉండి చదివే ఆన్‌లైన్ విద్యే మేలని భావించారు. మొబైల్ ఫోను, టీవీ ఉంటే ఎక్కడైనా పాఠాలు నేర్చుకోవచ్చని నిరూపించిన సంవత్సరం.. 2020.
పనితీరుకే పరీక్ష...
కొవిడ్ సంక్షోభం దేశ వైద్య ఆరోగ్య వ్యవస్థ పనితీరుకే పరీక్షపెట్టింది. సంస్కరించుకునే అవకాశమిచ్చింది. రోగులు వైద్యులను సంప్రదించటానికి యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. వారు వైద్యులను నేరుగా వెళ్లి కలసి వైద్యసలహాలు తీసుకునే పద్ధతి తాత్కాలికంగా కనుమరుగైంది. కరోనా ఉద్ధృతమైన తొలి రోజుల్లో కొవిడ్ ఆస్పత్రులు కిటకిటలాడాయి.
పెరిగిన స్పృహ...
మూడు నెలలుగా కొవిడ్ ఆస్పత్రులలో పడకలు దాదాపు ఖాళీగా ఉన్నాయి. అంటే కరోనా లక్షణాలను గుర్తించిన వెంటనే రోగులు అప్రమత్తమై వైద్యులు చెప్పిన జాగ్రత్తలు పాటించారు. రోగనిరోధక శక్తిపెరిగే ఆహారం తీసుకొని జాగ్రత్త పడ్డారు. ఆరోగ్య పరిరక్షణ స్పృహ పెరిగింది. కొవిడ్ సంక్షోభం ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధికి అవకాశంగా మారింది. తెలుగు రాష్ట్రాలలో అన్ని ఆసుపత్రులలో సదుపాయాలు మెరుగయ్యాయి. ఆక్సిజన్ అందించే సదుపాయాలతో పడకలు ఏర్పాటయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రులంటే ఉండే తేలికభావం పోయింది.
ఆత్మనిర్భర భారత్...
లాక్డౌన్ వల్ల భారత ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. నష్టాలతో వివిధ రంగాల ఉనినికే ముప్పు ఏర్పడింది. దేశ భద్రత ఎంత ముఖ్యమో, ఆర్థిక భద్రత అంతే ముఖ్యం. ఉద్దీపనలు, ఉపశమనాలు, ఆత్మనిర్భర్ చర్యలతో ఆత్మవిశ్వాసం కల్పించింది కేంద్రం. ఆర్థికానికి ఆసరాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీని ప్రకటించారు. ఇందులో భాగంగా రూ. 20 లక్షల కోట్ల ఉద్దీపనలు అందజేస్తామని వెల్లడించారు. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ను ఐదుదశలలో అమలు చేశామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అత్యంత దారుణంగా నష్టపోయిన రంగాలు మనుగడ సాగించేందుకు కేంద్రం రుణ సహకారం అందించింది.
నష్టపోయిన ఆర్థిక వ్యవస్థ...
ప్రపంచంలో కరోనా కారణంగా అత్యంత దారుణంగా దెబ్బతింది... భారత ఆర్థిక వ్యవస్థే. ఆర్థిక మాంద్యం రోజుల్లో కూడా మనదేశం ఇంతగా నష్టపోలేదు. కొవిడ్-19 వల్ల దేశవ్యాప్తంగా 14 కోట్ల మంది ఉద్యోగ, ఉపాధి కోల్పోయారు. కేవలం తొలి 21 రోజుల లాక్డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థకు రూ. 32 వేల కోట్ల నష్టం జరిగింది.
లాక్‌డౌన్‌తో మార్కెట్ స్థిరత్వం లేకపోవటం వల్ల దేశ వృద్ధి రేటు 2020 నాలుగో త్రైమాసికానికి 3.1 శాతానికి పడిపోయినట్లు కేంద్ర గణాంకాలు వెల్లడించాయి. 2020-21 మొదటి త్రైమాసికంలో జీడీపీ ఆందోళనకరంగా మైనస్ 24 శాతానికి తగ్గిపోయింది. పర్యాటక, ఆతిథ్య రంగాలు తీవ్రంగా నష్టపోయాయి.