Land Market Values: తెలంగాణలో నేటి నుంచి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల కొత్త విలువలు అమల్లోకి రానున్నాయి. కొత్త విలువల కంటే ముందు.. ఆ శాఖ ఆదాయం అనూహ్యంగా పెరిగింది. డిసెంబర్ నెలలో రికార్డు స్థాయిలో రూ.1261 కోట్ల 88 లక్షల రాబడి వచ్చి రికార్డు నెలకొల్పింది. అయితే జనవరి నెలలో ఏకంగా రూ.14 వందల కోట్లకుపైగా ఆదాయం రావడంతో... ఆ రికార్డును బద్దలు కొట్టినట్లయ్యింది.
గత ఆర్థిక ఏడాదిలో రూ.10 వేల కోట్లు రాబడి తీసుకురావాలని స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. కానీ కొవిడ్ ప్రభావంతో ఆ పరిస్థితులు లేకపోవడంతో ఆ లక్ష్యాన్ని 6 వేల కోట్లకు సవరించింది. కేవలం 4 వేల 787 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ ఆర్థిక ఏడాదిలో 12 వేల 500 కోట్లుగా స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ల శాఖకు లక్ష్యంగా నిర్దేశించింది. కొవిడ్ ప్రభావం లేకపోయినా.. అంత మొత్తం రావడం సాధ్యం కాదని అధికారులు తర్జనభర్జన పడ్డారు. 2021 జులై 22న రిజిస్ట్రేషన్ ఛార్జీలు, మార్కెట్ విలువలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. దీంతో దాదాపు రెండున్నర వేల కోట్ల రూపాయలు ఆదాయం అదనంగా వస్తుందని అంచనా వేశారు. ఏప్రిల్ నుంచి జనవరి వరకు వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు, ఈసీలు, సీసీలు ఇతరత్రా సేవల ద్వారా.. రూ. 9,611 కోట్ల ఆదాయం వచ్చింది.