NEW AP HIGH COURT JUDGES TAKES OATH TODAY: ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా డాక్టర్ కుంభాజడల మన్మథరావు, బొడ్డుపల్లి శ్రీ భానుమతి హైకోర్టులో నేడు ప్రమాణం చేయనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర వారిరువురితో మధ్యాహ్నం 2.15 గంటలకు ప్రమాణం చేయించనున్నారు. మొదటి కోర్టు హాలులో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొంటారు. అనంతరం సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లాలతో కొత్తగా బాధ్యతలు చేపట్టిన న్యాయమూర్తులు బెంచ్‌లలో పాల్గొని కేసులను విచారిస్తారు. కొత్తగా ఇద్దరి నియామకంతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 20కి చేరింది.
డాక్టర్ కె.మన్మథరావు స్వస్థలం ప్రకాశం జిల్లా సింగరాయకొండ. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి బీఎల్, ఉస్మానియా వర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌ఎం, ఆంధ్రావర్సిటీ నుంచి ‘లా’లో పీహెచ్‌డీ చేశారు. 1991 జూన్ 25న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. ఒంగోలు, కందుకూరులో ప్రాక్టీసు చేశారు. 1999లో ప్రాక్టీసును హైదరాబాద్‌కు మార్చుకున్నారు. సీబీఐ, ఎక్సైజ్ సీనియర్ స్టాండింగ్ కౌన్సెల్‌గా, ఈడీ, డీఆర్‌ఐలకు స్పెషల్ పీపీగా, ప్యానల్ కౌన్సెల్‌గా సేవలు అందించారు. ప్రస్తుతం వివిధ కేంద్రప్రభుత్వ శాఖలు, ఆర్థికసంస్థలు, వివిధ కంపెనీలకు స్టాండింగ్ కౌన్సెల్‌గా పని చేస్తున్నారు.