రాష్ట్ర ప్రభుత్వం జీవో 39తో తీసుకొస్తోన్న 2020-23 నూతన పారిశ్రామిక విధానం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని... భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. ఈ వర్గాలకు 2015-20 పారిశ్రామిక విధానంలోని రాయితీలను తీసేశారని... సబ్సిడీ శాతాన్ని 45 నుండి 35 శాతానికి తగ్గించారని ఒక ప్రకటనలో విమర్శించారు. గతంలో పరిశ్రమ పెట్టిన ఆరు నెలల్లో సబ్సిడీ వచ్చేదని... ఇప్పుడు మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు యూనిట్ విజయవంతంగా నడుస్తూ వుంటేనే రాయితీ ఇస్తారని... గతంలో 75 లక్షల రూపాయలకు గరిష్టంగా ఉన్న సబ్సిడీని 50 లక్షల రూపాయలకు తగ్గించారన్నారు.
నూతన విధానం ప్రకారం సేవా రంగానికి సబ్సీడి పూర్తిగా ఎత్తేశారని... నూతన పరిశ్రమలకు ప్రోత్సాహకాలు లేవని ఆక్షేపించారు. దీనివల్ల కొత్తగా పరిశ్రమలు రావని... అలాంటప్పుడు 'ఉద్యోగ కల్పన' అనే అంశానికి అవకాశం లేదన్నారు. బ్యాంకర్లు ముందుకు రారని... మూడేళ్ల తర్వాత రాయితీలు ఇస్తామన్నా ఆచరణలో ఆరేళ్లు పడుతుందన్నారు. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి మందగించి... ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గుతుందని వీర్రాజు అభిప్రాయపడ్డారు. ఏపీఐఐసీ పైనా దీని ప్రభావం పడుతుందని... ప్లాట్లు కొనుగోలుకు ఔత్సాహికులు వెనుకంజ వేస్తారని పేర్కొన్నారు. ప్రోత్సాహకాల కోసం ఎదురుచూసే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఇది నిరుత్సాహం కలిగిస్తోందన్నారు.