రాష్ట్రంలోని అత్యంత వెనకబడిన మండలాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వెయ్యి రోజులు సంరక్షణలో భాగంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ సమ్మిళిత అభివృద్ధి కార్యక్రమం (ఏపీఆర్ఐజీపీ) కింద గుర్తించిన 161 మండలాల్లో పెరటి కోళ్లు పంపిణీ చేయనుంది. ఏ, సీ విటమిన్లు, కాల్షియం లేమి లేకుండా వీటితో పండ్లు, ఇతర ఆకుకూరలు అందించే పోషకాహర తోట (న్యూట్రీగార్డెన్)ల పెంపకాన్ని ప్రోత్సహించనుంది. ఇందుకోసం ఆయా మండలాల పరిధిలోని ఒక్కో మండల సమాఖ్యకు ఐదు లక్షలు, గ్రామైక్య సంఘాలకు లక్ష రూపాయల చొప్పున కేటాయించింది. మానవ వనరుల అభివృద్ధి పెట్టుబడి నిధి కింద ప్రపంచ బ్యాంకు, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి.
ఒక్కో కుటుంబానికి 5 పెరటి కోళ్లు:
ఏపీఆర్ఐజీపీ మండలాల్లో 1000 రోజుల సంరక్షణ కింద 2019-20 ఏడాదికి 1,83,291 మంది గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు లబ్ధి చేకూర్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ 1,08,456 మంది అర్హులను గుర్తించారు. వీరికి 5 పెరటి కోళ్లు చొప్పున అందిస్తారు. వీటి గుడ్లతోపాటు మాంసం వినియోగించుకునే అవకాశం ఉంటుంది. సాధారణ పెరటి కోళ్లలో గుడ్డు పెట్టే కాల పరిమితి కాస్త ఎక్కువ ఉన్నందున వీటి స్థానంలో ఎండిట్రో కోళ్లను ఇచ్చే ఆలోచన చేస్తున్నారు. ఈ రకం కోళ్లు రోజూ ఒక గుడ్డు పెడతాయి.