New Districts: కొత్త జిల్లాల ఏర్పాటుకు మరో అడుగుపడింది. గత నెలాఖరున ప్రభుత్వం ప్రకటించిన కొత్త జిల్లాలకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన అభ్యంతరాలు, సలహాలు, సూచనలపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాలు నేటి నుంచి జరగబోతున్నాయి. తాజా సమాచారం ప్రకారం అన్ని జిల్లాల్లో కలిపి రెండువేలకుపైగా అర్జీలు అందినట్లు తెలిసింది. 1,478 అభిప్రాయాలు, అభ్యంతరాలు వచ్చినట్లు అధికారికంగా ప్రభుత్వానికి సమాచారం అందింది. ప్రజాప్రతినిధులు, వివిధ ఉద్యోగ, ప్రజాసంఘాల వారు వినతులు ఇస్తున్నారు. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 700, తక్కువగా శ్రీకాకుళం జిల్లాలో 16 విజ్ఞప్తులు అందాయి. అభ్యంతరాల స్వీకరణకు వచ్చే నెల 3 దాకా గడువున్నా.. ముందుగానే సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుండటం చర్చనీయాంశమైంది. ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాల్లో కార్యకలాపాలు ప్రారంభించేలా సన్నాహాలు సాగుతున్నాయి.
నాలుగు సమావేశాలు...
13 జిల్లాల కలెక్టర్లతో బుధవారం నుంచి ఈ నెల 28 మధ్య 4 రోజులు విజయవాడ, తిరుపతి, అనంతపురం, విశాఖపట్నం నగరాల్లో సమావేశాలు నిర్వహించనున్నారు. విజ్ఞప్తుల గురించి ఈ సమావేశాల్లో జిల్లాల కలెక్టర్లు వివరించాలని రాష్ట్ర ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయకుమార్ ఆదేశాలు జారీచేశారు. 23న విజయవాడలో... కృష్ణా, పశ్చిమగోదావరి, ప్రకాశం, గుంటూరు జిల్లాల కలెక్టర్లతో, 24న తిరుపతిలో... చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల కలెక్టర్లతో, 26న అనంతపురంలో... అనంతపురం, కర్నూలు జిల్లాల కలెక్టర్లతో, 28న విశాఖపట్నంలో... విశాఖపట్నం, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల కలెక్టర్లతో సమావేశాలు ఉంటాయి.
హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలంటూ..
అనంతపురం జిల్లాలో 700 వరకు విజ్ఞప్తులొచ్చాయి. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ 350 విజ్ఞప్తులు అందాయి. ధర్మవరం రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని 330 వినతులొచ్చాయి. పెనుకొండను జిల్లా కేంద్రం చేయాలని 3, రామగిరి మండల కేంద్రాన్ని అనంతపురం డివిజన్‌లో కలపాలని 3 విజ్ఞప్తులు అందాయి.
అనకాపల్లి జిల్లాను కోరుతూ...
విశాఖపట్నంలో 245 అర్జీలొచ్చాయి. నర్సీపట్నం కేంద్రంగా అనకాపల్లి జిల్లాను ఏర్పాటు చేయాలంటూ 72 మంది ఆకాంక్షను వెలిబుచ్చారు. అనకాపల్లి జిల్లాలో పెందుర్తి నియోజకవర్గాన్ని కలపొద్దని విశాఖలోనే ఉంచాలని కోరుతున్నారు. అరకు కేంద్రంగా అల్లూరి జిల్లాను ఏర్పాటుచేయాలని, రంపచోడవరాన్ని అల్లూరి జిల్లాలో కలపొద్దని, మైదాన ప్రాంతంలోని షెడ్యూల్ ప్రాంతాలను అల్లూరి జిల్లాలో కలపాలని డిమాండ్లున్నాయి.
‘కృష్ణా’కు ఎన్టీఆర్ పేరు పెట్టాలని...
కృష్ణా జిల్లాలో 37 అభ్యర్థనలు అందాయి. గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలను విజయవాడ కేంద్రంగా ఉన్న ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని, అవనిగడ్డ, కంకిపాడు, మైలవరం మండలాలను రెవెన్యూ డివిజన్‌లుగా చేయాలని కోరారు. విజయవాడకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని.. ఇప్పటికే విజయవాడకు పెట్టిన ఎన్టీఆర్ పేరును కృష్ణా జిల్లాకు మార్చాలని కోరుతున్నారు.
పేర్లు మార్చాలంటూ...
గుంటూరు జిల్లాలో... గురజాలను పల్నాడు జిల్లా కేంద్రం చేయాలని, జాషువా పేరునూ జత చేయాలనే విన్నపంతో వందల సంఖ్యలో అర్జీలొచ్చాయి. బాపట్ల జిల్లాకు భావపురి పేరు పెట్టాలని కోరారు. పెదకూరపాడు-సత్తెనపల్లి నియోజకవర్గాల్లోని మండలాలను కలుపుతూ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలంటూ వినతిపత్రాలిచ్చారు. అమరావతి కేంద్రంగా రాజధాని ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించాలని అఖిల భారత పంచాయతీ పరిషత్తు జాతీయ కార్యదర్శి జాస్తి వీరాంజనేయులు విన్నవించారు.
‘మెంటాడ’ను విజయనగరంలో ఉంచాలి