ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైకాపా విజయానికి సైనికుల్లా పనిచేస్తాం... కొత్త మంత్రుల తొలి పలుకులు - కొత్త మంత్రుల తొలి పలుకులు

New Ministers Comments: రాష్ట్రంలో నూతన మంత్రి వర్గం కొలువుతీరిన సంగతి తెలిసిందే. ప్రమాణ స్వీకారాల కార్యక్రమం తర్వాత మంత్రివర్గ సభ్యులు మాట్లాడారు. చాలామంది మంత్రులు జగన్​కు రుణపడి ఉంటామని, వచ్చే ఎన్నికల్లో వైకాపాను గెలిపించి బహుమతిగా ఇస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా సైనికులుగా పనిచేస్తామని కొందరు తెలిపారు. ఇంకా ఏం చెప్పారో వారి మాటల్లోనే తెలుసుకుందామా..

1
1

By

Published : Apr 12, 2022, 8:23 AM IST

New Ministers Comments: బీసీలకు మంత్రివర్గంలో పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.. దేశానికే ఆదర్శనీయ సీఎం అని కొత్త మంత్రులు కొనియాడారు. తాము ప్రత్యేకంగా ఏమీ చేయాల్సిన పనిలేదని అంతా ముఖ్యమంత్రే చూసుకుంటారని కొందరు స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో వైకాపాను గెలిపించి ఆయనకు బహుమతిగా ఇస్తామని ఎక్కువ మంది చెప్పారు. మంత్రివర్గ సభ్యులుగా ప్రమాణం తర్వాత వారు మీడియాతో మాట్లాడారు.

నాపై చాలా పెద్ద బాధ్యతను పెట్టారు:‘జలవనరుల శాఖను కేటాయించి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నాపై చాలా పెద్ద బాధ్యతను పెట్టారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్‌ శంకుస్థాపన చేసిన పోలవరం ప్రాజెక్టును సీఎం జగన్‌తో ప్రారంభించేలా చేస్తాం’ -మంత్రి అంబటి రాంబాబు

మేం ప్రత్యేకంగా అభివృద్ధి చేయనక్కర్లేదు:మేం ప్రత్యేకంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదు. జగన్‌ ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. గ్రామాల్లో పేదలంతా ఆయనపై విశ్వాసంతో ఉన్నారు. కరవు కాటకాలు, కరోనా వచ్చినా ఆకలి బాధల్లేవు. - కె.నారాయణస్వామి, ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్‌శాఖ మంత్రి

దేశం గర్వించదగ్గ ముఖ్యమంత్రి జగన్‌:యువనేత, దేశం గర్వించదగిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.. సంక్షేమ పథకాలను గిరిజనులకు అందిస్తున్నారు. 2024 ఎన్నికల్లో సైనికుల్లా పనిచేస్తాం. రాజశేఖరరెడ్డి భక్తుడిగా, జగనన్న సైనికుడిగా ఉంటా. - పీడిక రాజన్నదొర, ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి

వైకాపా విజయానికి సైనికుల్లా పనిచేస్తాం:రెండోసారి క్యాబినెట్‌లో అవకాశం కల్పించి, ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో మైనార్టీలకు ఇంత పెద్ద పీట వేసిన దాఖలా లేదు. 2024 ఎన్నికల్లోనూ వైకాపా విజయఢంకా మోగించేందుకు సైనికుల్లా పనిచేస్తాం. - అంజాద్‌ బాషా, ఉప ముఖ్యమంత్రి, మైనార్టీశాఖ మంత్రి

దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూస్తాం:కష్టపడే తత్వం, సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని మంత్రి పదవి ఇచ్చారనుకుంటున్నా. దేవాలయాలకు సంబంధించి గతంలో జరిగిన సంఘటనలపై విచారణ జరుగుతుంది. భక్తులపై భారం పడకుండా నిర్ణయాలు తీసుకుంటాం. దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూస్తాం. - కొట్టు సత్యనారాయణ, ఉపముఖ్యమంత్రి- దేవాదాయ శాఖ

2024 నాటికి గ్రామాలన్నీ అభివృద్ధి చేస్తాం:వార్డు సభ్యుడి నుంచి ఎమ్మెల్యే వరకు అన్ని పదవులూ నిర్వహించాను. పల్లెల్లో అవసరాలు, అక్కడి ప్రజల కష్టాలు.. ఏం చేస్తే వారి జీవనశైలి మెరుగుపడుతుందనే అంశాలపై అవగాహన ఉంది. నాకిచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని 2024 నాటికి గ్రామాల్ని అభివృద్ధి చేసి చూపిస్తా. - బూడి ముత్యాలనాయుడు, ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ

మత్స్యకారుడిగా గర్వపడుతున్నా:ఏడాదిన్నరలో పశుసంవర్థక, మత్స్యశాఖలో కొన్ని కార్యక్రమాలు అమలు చేశాం. మత్స్యకారుల వలసలను నివారించేందుకు హార్బర్లను నిర్మిస్తున్నాం. ఒక మత్స్యకారుడిగా.. మత్స్య, పశుసంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి నిర్వహించడం గర్వకారణం. - సీదిరి అప్పలరాజు, పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి

షూటింగులు చేయను.. ప్రజాసేవకే పూర్తి సమయం:కుటుంబాన్ని పోషించుకోవడానికి, నా అభిమానులను ఆనందపరచడానికి నటిస్తూ వచ్చాను. అదీ నాకు రాజకీయంగా ఉపయోగపడింది. అంతకంటే ఎక్కువగా ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకని ఇకపై షూటింగ్‌లు చేయను. ప్రజాసేవలోనే నిమగ్నమవుతా. - ఆర్‌కే రోజా, పర్యాటక సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ మంత్రి

జగన్‌ గొప్ప అదృష్టం కల్పించారు:బడుగు బలహీనవర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు, గూడు లేని మహిళలకు ఇళ్లు కట్టించి ఇచ్చే గొప్ప అవకాశాన్ని జగన్‌ కల్పించారు. ఆయనకు ధన్యవాదాలు. రెండేళ్లలో 31 లక్షల మంది మహిళలకు ఇళ్లను సొంతం చేసి 2024 ఎన్నికలకు వెళ్లేలా శాఖను తీర్చిదిద్దుతా. - జోగి రమేశ్‌, గృహనిర్మాణశాఖ మంత్రి

30 ఏళ్లు జగన్‌ సీఎంగా ఉండాలని కోరుకుంటున్నా:నవరత్నాలతో 95% న్యాయం జరిగింది. బీసీలకు పెద్దపీట వేశారు. అట్టడుగు వర్గాల వారిని పైకి తేవాలని ఆలోచించారు. ప్రతి ఇంటికీ పథకాలు అందిస్తున్నారు. రాష్ట్రమంతా జగన్‌వైపు చూస్తోంది. 30 ఏళ్లు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నా. - గుమ్మనూరు జయరాం, కార్మిక, ఉపాధికల్పనాశాఖ మంత్రి

బీసీలంతా జగనన్న పల్లకీ మోస్తాం:బీసీ ముఖ్యమంత్రి ఉన్నా.. ఇంతగా బీసీలకు న్యాయం చేస్తారో లేదో? జగన్‌ మోహన్‌రెడ్డి బీసీలకు ఎంతో పెద్దపీట వేశారు. ఆయనకు ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో బీసీలంతా జగనన్న పల్లకీ మోసి మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకుంటాం. - కేవీ ఉషశ్రీచరణ్‌, మహిళా శిశుసంక్షేమశాఖ మంత్రి

కోనసీమలో అన్ని సీట్లూ గెలిపించి బహుమతి ఇస్తా:నా బాధ్యత మరింత పెరిగింది. నాపై సీఎం జగన్‌ ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయను. కొత్తగా ఏర్పడిన కోనసీమ జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైకాపాను గెలిపించి ఆయనకు బహుమతి ఇస్తా. - పి.విశ్వరూప్‌, రవాణాశాఖ మంత్రి

బాగా పనిచేసి జగనన్నను మళ్లీ సీఎం చేస్తాం: తన బృందంలో నన్ను చేర్చుకున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు. రాబోయే రెండేళ్లు బాగా పనిచేసి మళ్లీ వైకాపాను అధికారంలోకి తెచ్చేందుకు, జగన్‌ను ముఖ్యమంత్రిగా చేసేందుకు కృషి చేస్తాం. - దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా), రహదారులు, భవనాలశాఖ మంత్రి

అనకాపల్లి ప్రజలకు, జగన్‌కు రుణపడి ఉంటా:మంత్రిగా పనిచేసే అవకాశం జగన్‌ దయవల్లే వచ్చింది. నేను, నా కుటుంబం.. నన్ను గెలిపించి ఈ స్థాయిలో నిలిపిన అనకాపల్లి ప్రజలకు, సీఎంకు రుణపడి ఉంటాం. ప్రభుత్వం ద్వారా ప్రజలకు మేలు చేయడం, 2024 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తేవడమే నా ప్రధాన అజెండా. - గుడివాడ అమర్‌నాథ్‌, పరిశ్రమలు, మౌలిక వసతులు, ఐటీ శాఖ మంత్రి

పేదరికం నుంచి బయటపడేసే చర్యలు:ఈ రోజు పేదవాడు యాచకుడు కాదు. వెతికిపట్టి పేదరికం నుంచి బయటపడేసేందుకు ముఖ్యమంత్రి జగన్‌.. గ్రామీణ స్థాయిలో సచివాలయ వ్యవస్థను తెచ్చారు. గ్రామస్థాయిలో సమస్యలను పరిష్కరించేలా చేస్తున్నారు. సినీపరిశ్రమను మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కీలక బాధ్యతలను సీఎం అప్పగించారు. - చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, బీసీ సంక్షేమశాఖ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి

మరింత మెరుగ్గా పౌరసేవలు: జగన్‌ సీఎం అయ్యాక గడప వద్దకే నిత్యావసరాలు అందిస్తున్నారు. ఇతర రాష్ట్రాలూ దీన్ని అనుసరిస్తున్నాయి. ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా, ధాన్యం రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా, పేదలకు నిత్యావసరాలు అందేలా చూస్తాను. - కారుమూరి నాగేశ్వరరావు, పౌరసరఫరాలశాఖ మంత్రి

ఇదీ చదవండి: AP New Cabinet : అక్షర క్రమంలో .. అంబటితో మొదలై.. రజనితో ముగింపు

ABOUT THE AUTHOR

...view details