Degree colleges: రాష్ట్రవ్యాప్తంగా సుమారు వంద ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ఈ ఏడాది కొత్తగా ప్రవేశాలు బంద్ కానున్నాయి. నిబంధనల ప్రకారం అర్హత కలిగిన అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు, గ్రంథాలయాలు, ఇతర సౌకర్యాలు లేవని విశ్వవిద్యాలయాలు ఈ ఏడాది అనుబంధ గుర్తింపు నిలిపివేశాయి. దీంతో ఆయా కళాశాలలను కౌన్సెలింగ్ జాబితా నుంచి తొలగించారు. విశ్వవిద్యాలయాలు మొదట చేపట్టిన తనిఖీల్లో అన్ని డిగ్రీ కళాశాలలకు అనుమతులు వచ్చాయి. అయితే.. లోపాలు ఉన్నా ఎందుకు అనుమతులు ఇచ్చారంటూ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు వర్సిటీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోసారి తనిఖీలు చేయాలని సుమారు 200కళాశాలల జాబితాను విశ్వవిద్యాలయాలకు పంపించారు. పునఃపరిశీలనలో వంద కళాశాలలకు అనుమతులు నిలిపివేసేందుకు వర్సిటీలు నివేదికలు ఇచ్చాయి. సోమవారం వర్సిటీ పాలకవర్గ సమావేశాల్లో ఇందుకు ఆమోదం లభించింది. గుర్తింపు నిలిపివేసిన కళాశాలలను ప్రస్తుతం ఉన్న రెండు, మూడు సంవత్సరాల విద్యార్థుల కోసం కొనసాగిస్తారు. మొదటి ఏడాదిలో ప్రవేశాలు ఉండవు. లోపాలను సరి చేసుకుంటే వచ్చే ఏడాది గుర్తింపునిస్తారు.