తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అందుబాటులోకి రానున్న వరంగల్ మెట్రో రైలు(neo metro rail) ఆకాశ, భూ మార్గంలో పయనించనుంది. అందుకోసం మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ (Maharashtra Metro Rail Corporation Ltd) సంస్థ సరికొత్త సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (DPR)ను రూపొందించింది. గతంలో 15 కిలోమీటర్ల మెట్రో మార్గాన్ని పూర్తిగా హైదరాబాద్ తరహాలో ఆకాశమార్గంలో నిర్మించాలని ప్రతిపాదించగా తాజాగా మార్పులతో కొత్త డీపీఆర్(DPR)ను మహామెట్రో సంస్థ సిద్ధం చేసింది.
నాసిక్, నాగ్‌పూర్ తరహాలో
కొత్త విధానంలో నిర్మాణ వ్యయంతోపాటు నిర్వహణ ఖర్చు కూడా తగ్గుతుందని మహామెట్రో సంస్థ పేర్కొంది. దాదాపు రూ.2,000 కోట్ల మేర ఆదా అవుతుందని సంస్థ వివరించింది. ఏడు కి.మీ. భూ, మరో 8 కి.మీ. ఆకాశమార్గంలో మెట్రో రైలు నడుస్తుంది. మహా మెట్రో సంస్థ రూపొందించిన నియో వరంగల్ కొత్త డీపీఆర్‌ను కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(kuda warangal) రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసిందని.. త్వరలో దీన్ని కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపనున్నారని మహామెట్రో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బ్రిజేష్ దీక్షిత్ తెలిపారు. నాసిక్, నాగ్‌పుర్ తదితర నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టుల నిర్మాణ బాధ్యతలను ఈ సంస్థ నిర్వహిస్తోంది. వరంగల్ మెట్రోకు నాసిక్ నియో మెట్రో రైలు ప్రాజెక్ట్ తరహాలోనే డీపీఆర్‌ను రూపొందించింది.