చాలామంది ప్రజలు వారం, పది రోజులపాటు కరోనా లక్షణాలతో బాధపడుతున్నా పరీక్ష చేయించుకోవడం లేదు. కొంతమంది ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారిన సమయంలోనో.. లేదా ఇతరత్రా లక్షణాలు తీవ్రమైన తరువాతో పరీక్ష చేయించుకుంటున్నారు. అప్పటికే ఊపిరితిత్తుల పని మందగిస్తోంది. మరికొంతమంది సొంత వైద్యం చేసుకుంటున్నారు. కనీసం పల్స్‌మీటరుతో ఆక్సిజన్ శాతం చెక్ చేసుకోవడం లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అనేకమంది ఆస్పత్రిలో చేరకుండానే మరణిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం కూడా కొంత తోడైంది. ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకుంటే మూడు రోజులకు గానీ ఫలితం రావడం లేదు. ఈ మూడు రోజులు సంబంధిత అనుమానితులు కుటుంబంతో కలిసి ఉంటున్నారు. మందులు వేసుకోకపోవడం కూడా ఇబ్బందిగా మారింది.
చివరి నిమిషంలో రావడం వల్లే :
తమ ఆస్పత్రికి వచ్చే 75 శాతం మంది రోగులు ప్రైవేటు ఆస్పత్రి నుంచే వస్తున్నారు. చివరి దశలో వస్తున్నారు. అటువంటి వారికి ఎంతగా వైద్యం అందిస్తున్నా కోలుకోవడం లేదు. అనేకమంది కొవిడ్ సోకినా వెంటనే పరీక్షలు చేయించుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. దీంతో సాధారణ వైద్యం సైతం అందకపోవడం వల్ల వ్యాధి ముదిరి మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకుని వైద్యం పొందాలి.
- డా.రాజారావు, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్