skill training colleges and universities in ap: నైపుణ్య కళాశాలలు, విశ్వవిద్యాలయాల ఏర్పాటులో మాటలు తప్ప.. క్షేత్ర స్థాయిలో చేతలు కనిపించడం లేదు. ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లవుతున్నా ఇంతవరకూ నైపుణ్య కళాశాలలకు టెండర్ల ప్రక్రియే పూర్తి కాలేదు. ఏటా లక్షల మంది విద్యార్థులు విద్యా సంస్థల నుంచి బయటకు వస్తున్నా వారికి ప్రభుత్వం చెప్పినట్లు శిక్షణ అందడం లేదు. లోక్‌సభ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 25, పులివెందుల, ట్రిపుల్‌ఐటీల్లో కలిపి మొత్తం 30 నైపుణ్య కళాశాలలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో కళాశాల ఏర్పాటుకు 20 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. రెండింటిని డ్రైవింగ్, ట్రాఫిక్ రీసెర్చ్ సంస్థ నిర్మించనుంది. ఈ రెండింటి పనులూ ప్రారంభం కాలేదు. పులివెందులలో పీఏడీఏ నిర్మాణాలు చేపట్టింది. ట్రిపుల్‌ఐటీల్లో నిర్మించాల్సిన వాటికి నిధులు ఎవరు సమకూర్చాలనే దానిపై స్పష్టత లేకపోవడంతో ఈ 4 కళాశాలల ప్రతిపాదన మూలన పడింది. మిగతా 23 కళాశాలలను ప్రభుత్వం నిర్మించాలి. వీటికి భవన నిర్మాణాలకు ఆకృతులను రూపొందించారు. అయితే నిర్మాణాలు చేపట్టేందుకు గుత్తేదారులు ముందుకు రావడం లేదు. ఇవి పూర్తయితే ఏడాదికి 1,920 మంది విద్యార్థులకు శిక్షణ లభిస్తుంది.
రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న 30 నైపుణ్య కళాశాలలకు అనుబంధంగా తిరుపతిలో నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీని నిర్మాణంపై ఇంతవరకు అధికారులకే స్పష్టత లేదు. కేవలం ఇంజినీరింగ్ వారికే హైఎండ్ శిక్షణ ఇచ్చేందుకు విశాఖపట్నంలో మరో నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇది కాగితాలకే పరిమితమైంది. కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు తరచూ ప్రభుత్వం చెప్పడం తప్ప ఇవి ఎప్పుడు అందుబాటులోకి వస్తాయనే దానిపై స్పష్టత లేదు. టెండర్లు పిలిచి, నిర్మాణాలు పూర్తి చేసి, శిక్షణ చేపట్టేందుకు కనీసం ఏడాది పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ లెక్కన 2022లోనూ ఈ కళాశాలలు అందుబాటులోకి రావడం కష్టమే.
ఏపీఎస్‌ఎస్‌డీసీ తరఫున గతంలో నిర్వహించిన నైపుణ్య శిక్షణలు దాదాపుగా నిలిచిపోయాయి. గతంలో సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో నిర్వహించే నైపుణ్య వికాసం, డిగ్రీ కళాశాలల్లో స్కిల్ సెంటర్లు, గిరిజన ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు ట్రైకార్‌తో కలిసి నిర్వహించే శిక్షణ, ఉపాధి కల్పన, మహిళా ప్రాంగణాల్లోని నైపుణ్య శిక్షణ, కృషి విజ్ఞాన కేంద్రాలు, నర్సరీ ట్రైనింగ్, ఆక్వా రంగంలో పని చేసేలా శిక్షణలు ఇవ్వడం లేదు. ఏపీఎస్‌ఎస్‌డీసీలో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలను సక్రమంగా ఇవ్వడం లేదు. మానవ వనరుల విధానం రూపకల్పన పేరుతో సుమారు 110మందికి జీతాలు నిలిపేశారు.
నైపుణ్య కళాశాలలు, వర్శిటీల ఏర్పాటులో.. పడని ముందడుగు - apssdc latest news
APSSDC skill training: 30 నైపుణ్య కళాశాలలతో పాటు రెండు విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు శిక్షణ ఇస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. మూడేళ్లు గడిచినా అవి ఇంకా టెండర్ల గడప మాత్రం దాటలేదు. ఫలితంగా లక్షలమందికి నైపుణ్య శిక్షణ అందని ద్రాక్షగానే మిగిలింది. అటూ.. నిధుల కొరతతో ఇప్పటి వరకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నైపుణ్య శిక్షణ కార్యక్రమాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
నైపుణ్య శిక్షణ కార్యక్రమాలపై సాగని ముందడుగు