నడిరోడ్డుపై ఉద్ధృతంగా ప్రవాహం. భారీ వాహనాలే పడవల్లా కొట్టుకుపోతున్నాయి. ఎక్కడికక్కడే విరిగిపడిన స్తంభాలు, తెగిపడిన వైర్లు.. కూలిపోతున్న గృహాలు.. కాపాడండి అంటూ ఆర్తనాదాలు. చుట్టుముట్టిన వరద నీటిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ సాయం కోసం ఎదురుచూస్తున్న ప్రజలు. ఇది వరదల సమయంలో భాగ్యనగరంలో కనిపించిన దృశ్యాలు.
ఆ సమయంలో మేమున్నామంటూ జీహెచ్ఎంసీ సకాలంలో స్పందించి విపత్తు నిర్వహణ బృందాలను రంగంలోకి దింపింది. విల్లు నుంచి వదిలిన శరములా దూసుకొస్తున్న ప్రవాహానికి ఎదురొడ్డి... కొట్టుకుపోతున్న వారి ప్రాణాలను నిలబెట్టి... నిరాశ్రయులైన వారికి నీడనిచ్చి... ఆకలన్న వారికి అన్నం పెట్టి.. అన్ని వేళలా అండగా నిలిచింది డీఆర్ఎఫ్. సుమారు 800 మంది శిక్షణ పొందిన సిబ్బందితో రెస్కూ ఆపరేషన్ నిర్వహించి పరిస్థితిని అదుపులోకి తెచ్చింది జీహెచ్ఎంసీ.