జిల్లా కేంద్రాలు, రాష్ట్ర రహదారులతో మండల కేంద్రాలను అనుసంధానించే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుపై ప్రతిష్టంభన ఏర్పడింది. రూ.6400 కోట్ల న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు (NDB) రుణంతో రాష్ట్రంలో ఏక వరుస ఉన్న రహదారుల విస్తరణకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వానికి కొత్త చిక్కు వచ్చిపడింది. కేంద్రంలోని డైరెక్టరేట్ ఆఫ్ ఎకనమిక్ అఫైర్స్ (డీఈఏ) ద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న ఎన్‌డీబీ... రుణం కింద తాము ఇస్తున్న నిధులను ఇతర అవసరాలకు మళ్లించకుండా ప్రత్యేక ఖాతా తెరవాలంటూ మొదట సూచించింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సమ్మతించింది. ఇంతలోనే ‘‘మేం రుణం కింద ఇచ్చే 70% నిధులను తొలుత మీరే(రాష్ట్ర ప్రభుత్వం) ఖర్చు చేయండి. వాటిని తర్వాత తిరిగి చెల్లింపులు (రీయంబర్స్) చేస్తాం’’ అని మెలికపెట్టడం గమనార్హం.
ఇవీ వివరాలు....
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో చాలావరకు మండల కేంద్రాల నుంచి రాష్ట్ర, జిల్లా రహదారుల వరకు ప్రస్తుతం ఏక వరుస రోడ్లు ఉన్నాయి. మండలాల కేంద్రాల మధ్య, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి కూడా ఒక వరుస రోడ్లే ఉన్నాయి. ఇలా 2,500 కి.మీ. మేర ఉన్న రోడ్లన్నింటినీ రెండు వరుసలుగా విస్తరించే ప్రాజెక్టు కోసం 2019లో రుణం మంజూరుకు ఎన్‌డీబీ అంగీకారం తెలిపింది. ఇందులో ఎన్‌డీబీ 70%, రాష్ట్రం 30% వెచ్చించాల్సి ఉంది. తొలి దశలో రూ.3,013.86 కోట్ల వ్యయంతో 1,243.53 కి.మీ. మేర విస్తరణ, వివిధ వంతెనల పునర్నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక జిల్లాలోని పనులన్నీ ఒకే ప్యాకేజీ కింద పరిగణించి రూ.1,860 కోట్ల విలువైన సివిల్ పనులకు టెండర్లు పిలిచి, గుత్తేదారు సంస్థలతో ఈ ఏడాది మార్చిలో ఒప్పందం చేసుకున్నారు. 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ కోసం గుత్తేదారు సంస్థలు ఎదురు చూస్తున్నారు. దీనిపై ఆర్‌అండ్‌బీ అధికారులు ఎన్‌డీబీని సంప్రదించడంతో వారు కొత్త షరతును విధించారు. దీంతో ఎన్‌డీబీ ప్రాజెక్టు ముందుకుసాగడం ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది.
యూసీ చూపిస్తేనే... తిరిగి చెల్లింపు