ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 23, 2022, 5:01 AM IST

ETV Bharat / city

"అధ్యక్షా.. మీరు చేస్తున్నది సంస్కారమా... మీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి"

శాసనసభలో తెదేపా సభ్యులు ఈల వేయడం పెద్ద దుమారం రేపింది. తెదేపా సభ్యులు, సభాపతి తమ్మినేని సీతారాం మధ్య వాగ్వాదానికి దారి తీసింది. సభలో విజిల్‌ ఊదడం ఏంటని... ఇది పద్ధతేనా అంటూ సభాపతి తమ్మినేని సీతారాం ప్రశ్నించగా.. పద్ధతి గురించి మీరు చెప్పాలా? అంటూ తెదేపా సభ్యులు ఎదురు ప్రశ్నించారు.

Natusara deaths issue on assembly
Natusara deaths issue on assembly

శాసనసభలో తెదేపా సభ్యులు ఈల వేయడం పెద్ద దుమారం రేపింది. తెదేపా సభ్యులు, సభాపతి తమ్మినేని సీతారాం మధ్య వాగ్వాదానికి దారి తీసింది. సభలో విజిల్‌ ఊదడం ఏంటని... ఇది పద్ధతేనా అంటూ సభాపతి తమ్మినేని సీతారాం ప్రశ్నించగా.. పద్ధతి గురించి మీరు చెప్పాలా? అంటూ తెదేపా సభ్యులు ఎదురు ప్రశ్నించారు. వందల మంది చనిపోతుంటే మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోతే ఏం చేయాలని నిలదీశారు. వారం రోజులుగా మీరు ఏం చేస్తున్నారో గుండెలపై చేయి వేసుకుని ఆత్మవిమర్శ చేసుకోవాలని తెదేపా సభ్యులనుద్దేశించి సభాపతి సూచించగా... మీరు చేస్తున్నది సంస్కారమా? మీరూ గుండెలపై చేయి వేసుకోండంటూ తెదేపా సభ్యులు ఎదురు సమాధానమిచ్చారు. అనంతరం విజిల్‌ వేసి, సభా నియమాలను ఉల్లంఘించినందున తెదేపా సభ్యులు గద్దె రామ్మోహనరావు, ఏలూరి సాంబశివరావును ఈ సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్‌ చేస్తున్నట్లు సభాపతి ప్రకటించారు. ఉదయం సభా ప్రారంభంలో సారా, మద్యం మరణాలపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని ప్లకార్డులు ప్రదర్శించి, బల్లలు చరిచినందుకు తెదేపా సభ్యులు అనగాని సత్యప్రసాద్‌, బెందాళం అశోక్‌, వెలగపూడి రామకృష్ణబాబు, రామరాజులను సైతం ఈ సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్‌ చేశారు. శాసనసభలో మంగళవారం మొత్తంగా ఆరుగురు తెదేపా సభ్యులను ఈ సమావేశాలు పూర్తయ్యే వరకూ, మిగతా వారిని ఒక్కరోజుకు సస్పెండ్‌ చేశారు.

సారా, మద్యం మరణాలపై రగడ
శాసనసభ మంగళవారం ప్రారంభం కాగానే కల్తీసారా, మద్యం మరణాలపై తెదేపా సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు సభాపతి ప్రకటించారు. తెదేపా సభ్యులు పోడియం వద్ద నిరసనకు దిగారు. వారిని పట్టించుకోకుండా సభాపతి ప్రశ్నోత్తరాలను చేపట్టారు. దీంతో స్పీకర్‌ డౌన్‌..డౌన్‌ అంటూ తెదేపా సభ్యులు నినాదాలు చేశారు. పోడియం నుంచి తెదేపా సభ్యులను మార్షల్స్‌తో వారి స్థానాల వద్దకు పంపించడంతో అక్కడే బల్లలు చరుస్తూ నినాదాలు చేశారు. అనుచిత ప్రవర్తనతో సభను అగౌరవ పరుస్తున్నారంటూ తెదేపా సభ్యులు అనగాని సత్యప్రసాద్‌, బెందాళం అశోక్‌, రామకృష్ణబాబు, రామరాజును ఈ సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్‌ చేస్తున్నట్లు సభాపతి ప్రకటించారు. దీంతో అందరూ బయటకు వెళ్లిపోయారు. అనంతరం 10.40 సమయంలో తిరిగి సభలోకి వచ్చిన సభ్యుల్లో ఇద్దరు విజిల్‌ ఊదారు. దీంతో సభలో దుమారం రేగింది. అప్పటికే సభలో మాట్లాడుతున్న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తన సీటులోనే కూర్చోగా... వైకాపా ఎమ్మెల్యే అంబటికి మాట్లాడే అవకాశం కల్పించారు.

చర్యలు తీసుకోవాల్సిందే: వైకాపా ఎమ్మెల్యేలు
సభలో ఈల వేసిన తెదేపా సభ్యులపై చర్యలు తీసుకోవాలని వైకాపా ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ... ‘‘సభలోకి విజిల్‌ తీసుకొచ్చే సంప్రదాయం ఎప్పుడూ లేదు. సంప్రదాయాలకు భిన్నంగా వ్యవహరిస్తుందుకు వారిపై చర్యలు తీసుకోవాలి’’ అని సూచించారు. ఎమ్మెల్యేలు కోరుముట్ల శ్రీనివాస్‌, జోగి రమేష్‌ మాట్లాడుతూ... ‘‘సభలో విజిల్‌ వేసిన, బల్లలు కొట్టిన తెదేపా సభ్యులను రెండేళ్లు సస్పెండ్‌ చేయండి’’ అని కోరారు.

విజిల్‌ వేసుకుంటారో, బాంబులు వేసుకుంటారోబయటకు వెళ్లి చేసుకోండి: సభాపతి తమ్మినేని సీతారాం

విజిల్‌ వేసుకుంటారో, బాంబులు వేసుకుంటారో బయటకు వెళ్లి చేసుకోండని తెదేపా సభ్యులనుద్దేశించి సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ... ‘‘శాసనసభ గౌరవాన్ని కాపాడండి. సభకు సహకరిస్తే సభ గౌరవం ఇస్తుంది. వారం రోజులుగా మీరు చేస్తున్నదాన్ని గుండెలపై చేయి వేసుకుని చెప్పుకోండి. సభలో విజిల్‌ ఏంటయ్యా? మీరు వేసిన ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సమాధానాలు తెప్పించుకుని, జవాబుదారీగా వ్యవహరించాలి’’ అని సూచించారు.

ఇదీ చదవండి:పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇసుక వివాదం.. డయాఫ్రం వాల్‌ పనులకు ఆటంకం

ABOUT THE AUTHOR

...view details