Natural Farming Schools in Hyderabad: హైదరాబాద్ నగర శివార్లలో వెలుస్తున్న నేచురల్ ఫార్మింగ్ స్కూళ్లు చిన్నారులలోని సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు వ్యవసాయంలోని మెలకువలను నేర్పిస్తున్నాయి. నగరానికి 60కిలోమీటర్ల పరిధిలోనే ఇవి ఉండటంతో సెలవురోజుల్లో పిల్లలతో తల్లిదండ్రులు ఇటు వైపు వస్తున్నారు. పదుల ఎకరాల్లో పదుల సంఖ్యలో పంటలను పండిస్తుండటంతో తక్కువ సమయంలో ఒకే వేదికగా అన్ని పంటల గురించి తెలుసుకునే వెసులుబాటు కలుగుతోంది.
Natural Farming Schools ఫార్మ్ ట్రైన్‌లో వెళ్దాం, పంటలు చూద్దాం - Natural Farming Schools Latest News
Natural Farming Schools in Hyderabad సమయం దొరికిందంటే చాలు స్మార్ట్‌ఫోన్ తెరను తడిమేస్తుంటారు ఈ తరం. వారి ఫోకస్‌ను ఫోన్‌పై నుంచి దూరం చేసి వారిలో సృజనాత్మకతను పెంపొందించడానికి హైదరాబాద్‌లో వినూత్న కార్యక్రమాలున్నాయి. అందులో ఒకటి నేచురల్ ఫార్మింగ్. వ్యవసాయంలో మెలకువలను నేర్పిస్తూ సరికొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి శివార్లలో వెలుస్తున్న నేచురల్ ఫార్మింగ్ స్కూళ్లు. పదుల ఎకరాల్లో ఏర్పాటు చేయడం, నగరానికి 60 కిలోమీటర్ల పరిధిలోనే ఇవి ఉండటంతో సెలవురోజుల్లో పిల్లలతో తల్లిదండ్రులు ఇటు వైపు వస్తున్నారు.
పప్పులు, ధాన్యాలు, కూరగాయలు, పండ్ల పెంపకంలో చిన్నారులను భాగస్వామ్యం చేస్తుండటం విశేషం. నారు పోయడం.. కలుపు తీయడం, కుప్పనూర్చడం, సేంద్రియ ఎరువులు తయారు చేయడం.. పశువులకు మేత వేయడం చేయిస్తుండటంతో విద్యార్థులు కొత్త అనుభూతిని పొందుతున్నారు. దీంతోపాటు వ్యవసాయక్షేత్రం మొత్తం తిరిగేలా ‘ఫార్మ్‌ట్రైన్’ వంటివి ఏర్పాటు చేస్తుండటం విశేషం. రోజూ 5 గంటల నుంచి 12గంటలు స్లాట్‌ల వారీగా అరగంట చొప్పున ఒక్కో కార్యక్రమంపై అవగాహన కల్పిస్తున్నారు.
రైలు ఆకర్షిస్తోంది: "ప్రతినెలా 300 మంది మా వ్యవసాయక్షేత్రాన్ని సందర్శిస్తున్నారు. నగరానికి చెందిన వివిధ పాఠశాలలు, కళాశాలల నుంచి వేలాది మంది విద్యార్థులు సందర్శించారు. ఐదు రకాల పప్పుదినుసులు, నూనెగింజల్లో నువ్వులు, వేరుశెనగ, సన్‌ఫ్లవర్ వంటివి పండిస్తున్నాం. వరి, గోధుమ, మొక్కజొన్న, తృణధాన్యాల్లో జొన్నలు, రాగులు, కొర్రలు, క్యాబేజీ, మిర్చి, వంకాయలు, క్యారట్, బీట్‌రూట్, వంటి పదుల సంఖ్యలో కూరగాయలు పండిస్తున్నాం. ఆవు, గేదె, గాడిద, గొర్రె, మేక, కుందేలు, కోడి, గుర్రం, టర్కీకోడి, బాతులకు ఆహారం అందించడంతోపాటు జంతువుల నుంచి పాలు పితకడంపై స్వీయ అనుభవం కల్పిస్తున్నాం. ప్రతీ కార్యక్రమం 25 నిముషాల చొప్పున అందిస్తూ 10 రకాల కార్యక్రమాలు ఐదుగంటల్లో నేర్పిస్తాం. వీటన్నింటినీ 20 నిముషాల్లో చూడటానికి ట్రాక్టర్‌కు అనుసంధానించి రూపొందించిన ఫార్మ్ ట్రైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది." - వంశీ, యాక్టివ్ ఫార్మ్‌స్కూల్ ప్రతినిధి