National Nutrition Week: మన అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు.. వారి చిన్నతనంలో సజ్జ అన్నం, సజ్జ రొట్టెలను ఆహారంగా తినేవారు. ఇప్పుడు అవి మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనో లేదా నగరాల్లోని ప్రముఖ హోటళ్లలోనో మాత్రమే కనిపిస్తున్నాయి. సజ్జలను నిత్యం ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. జీవనశైలి వ్యాధులను నియంత్రించే అనేక పోషకాలు వీటిలో ఉంటాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 56 శాతం జనాభా రక్తహీనత(అనీమియా)తో బాధపడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది.
Sajjala Pakodi : దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ శాతం ఇంకా ఎక్కువగా ఉంది. బియ్యం, గోధుమల కన్నా సజ్జల్లో ఇనుము, జింకు పోషకాలు అధికంగా ఉంటాయని, వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల అనీమియా బారిన పడకుండా ఉండవచ్చని డబ్ల్యూహెచ్‌ఓ సైతం సూచించింది. సజ్జల నుంచి బిస్కెట్లు, కేక్‌లు, రొట్టెలు సులభంగా తయారుచేసేలా ‘భారత చిరుధాన్యాల పరిశోధనా సంస్థ’(ఐఐఎంఆర్), ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధునిక యంత్రాలను అందుబాటులోకి తెచ్చాయి. వీటిని పలు సంస్థలు వినియోగించి సజ్జ ఉత్పత్తులను తయారుచేసి మార్కెట్లలో విక్రయిస్తున్నాయి. బెంగళూరు, హైదరాబాద్, ముంబయి వంటి నగరాల్లో ‘చిరుధాన్యాల ఆహారం’ అందించే ప్రత్యేక హోటళ్లలో సజ్జ ఆహారోత్పత్తులకూ డిమాండ్ ఉంటోంది.