తెలంగాణ రాష్ట్రం హనుమకొండ జిల్లా కేంద్రంలోని జేఎన్ఎస్ మైదానంలో 5 రోజుల పాటు జరిగిన 60వ జాతీయ స్థాయి అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలు అట్టహాసంగా ముగిశాయి. ముగింపు వేడుకలకు ఆ రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్, వరంగల్ సీపీ తరుణ్ జోషి హాజరయ్యారు. పోటీల్లో రాణించిన విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా వరంగల్ క్రీడలకు పెట్టింది పేరని మంత్రులు కొనియాడారు. వరంగల్‌ను స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దటానికి అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు 50 ఎకరాల భూమిని సేకరిస్తామని మంత్రి దయాకర్‌రావు తెలిపారు. జాతీయ క్రీడలు మరిన్ని నిర్వహించడానికి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో క్రీడలకు సీఎం కేసీఆర్ పెద్దఎత్తున ప్రోత్సాహం ఇస్తున్నారని మరో మంత్రి సత్యవతి రాఠోడ్ పేర్కొన్నారు. జాతీయ స్థాయి క్రీడలు ఇక్కడ నిర్వహించడం కోసం అన్ని రకాల వసతులు కల్పించారని తెలిపారు.