Har Ghar Thirang: 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా.. హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి కేంద్రం పిలుపునిచ్చింది. ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయజెండా ఎగరవేసి.. దేశభక్తిని చాటి చెప్పాలని ప్రధాని మోదీ దేశప్రజలను కోరారు. ఫలితంగా జాతీయ జెండాలకు అనూహ్య డిమాండ్ వచ్చింది. ప్రతీచోట వీలైనన్ని జెండాల తయారీకి ప్రయత్నిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు ఇంటింటికీ జెండాలు పంచేందుకు సిద్ధమయ్యాయి. ఆ మేరకు ఆర్డర్లు కూడా తయారీదారులకు అందాయి. విజయవాడలోనూ పెద్ద సంఖ్యలో జెండాలు తయారు చేస్తున్నారు.
Demand to National Flags: ఏటా పంద్రాగష్టు, గణతంత్ర దినోత్సవ వేడుకలకు.. జాతీయ జెండాల కొనుగోళ్లు జరుగుతుంటాయి. డిమాండ్‌కు అనుగుణంగా ముందే తయారు చేసేవారు. ప్రతీ ఇంటిపై.. జెండా ఎగరవేయాలనే సరికి కార్మికులకు చేతినిండా పని దొరికింది. విజయవాడ, విశాఖ, తిరుపతి వంటి పట్టణాల్లో పెద్ద ఎత్తున జెండాలు తయారవుతున్నట్లు వ్యాపారులు చెప్తున్నారు.