ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

National Conference on Oil Palm Cultivation: 'ఆయిల్‌పామ్ సాగులో తెలంగాణ అగ్రస్థానంలో నిలవబోతుంది' - ఏపీ తాజా వార్తలు

National Conference on Oil Palm Cultivation : హైదరాబాద్ హైటెక్స్‌లో ఆయిల్‌పామ్ సాగుపై జాతీయ సదస్సు జరుగుతోంది. సదస్సును కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్ ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరగనున్న జాతీయ సదస్సులో ఆయిల్‌పామ్‌ సాగు, భవిష్యత్ కార్యాచరణ రూపకల్పనపైన చర్చిస్తారు.

National Conference on Oil Palm Cultivation
National Conference on Oil Palm Cultivation

By

Published : Dec 28, 2021, 4:26 PM IST

National Conference on Oil Palm Cultivation : ఆయిల్‌పామ్‌ సాగు, పరిశ్రమ బలోపేతం, భవిష్యత్‌ కార్యాచరణపై హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జాతీయ సదస్సు జరుగుతోంది. సదస్సు సహా డ్రాగన్ ఫ్రూట్‌ ప్రదర్శన కార్యక్రమాన్ని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ ప్రారంభించారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, కేరళ మంత్రి ప్రసాద్‌ పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరగనున్న జాతీయ సదస్సులో ఆయిల్‌పామ్‌ సాగు, భవిష్యత్ కార్యాచరణ రూపకల్పనపైన.. జాతీయస్థాయి సంస్థలు, అధికారులు, నిపుణులు చర్చించనున్నారు.

రైతులకు మంచి రోజులు

Oil Palm Business Summit: స్వయం సమృద్ధి లక్ష్యంగా రైతుల ఆదాయాలు రెట్టింపు, పర్యావరణహితం దృష్ట్యా పంట మార్పిడి విధానం, ముడి వంట నూనెల దిగుమతులు పూర్తిగా తగ్గించుకోవాలన్న లక్ష్యంతో కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో ఆయిల్‌పామ్ రైతుల సంక్షేమం, పరిశ్రమ బలోపేతంపై.. ప్రత్యేక దృష్టి సారించింది. నేషనల్ ఎడిబుల్ ఆయిల్ మిషన్ - ఆయిల్‌పామ్ పథకం గురించి.. ఈశాన్య రాష్ట్రాల్లో విస్తృత ప్రచారం చేయడానికి ఉద్దేశించి.. అక్టోబరు 5న గౌహతిలో బిజినెస్ సమ్మిట్ నిర్వహించింది. హైదరాబాద్ వేదికగా ఈ కీలక జాతీయ సదస్సు జరుగుతునుందున.. ఆయిల్‌పామ్ రైతులకు మంచి రోజులు రానున్నాయని ఉద్యాన శాఖ వర్గాలు తెలిపాయి. మాదాపూర్‌ హెచ్​సీసీ నొవాటెల్‌లో రెండు రోజులపాటు జరగనున్న సదస్సును.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తొమర్ ప్రారంభించారు. ఈ సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సహా పలు రాష్ట్రాల మంత్రులు, కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి, పలు రాష్ట్రాల కార్యదర్శులు, కమిషనర్లు, ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రిలోచన్ మహాపాత్ర తదితరులు పాల్గొన్నారు. పంట సాగు చేసే 9 రాష్ట్రాలకు చెందిన.. ప్రతినిధులు హాజరయ్యారు.

తెలంగాణ అగ్రస్థానంలో..

Telangana Oil Palm Cultivation : కొవిడ్‌తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని కేంద్రమంత్రి అన్నారు. భారత్‌లో మాత్రమే వ్యవసాయ వృద్ధి ఆగలేదని.. రైతుల ఆదాయం రెట్టింపు కోసం కలిసి పనిచేయాలని కోరారు. సేంద్రియ సేద్యంపై దృష్టి సారించాలన్న కేంద్రమంత్రి.. దేశంలో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం 3 లక్షల హెక్టార్లలో ఆయిల్‌పామ్ సాగువుతోందని.. ఆయిల్‌పామ్ సాగులో తెలంగాణ అగ్రస్థానంలో నిలవబోతుందని చెప్పారు.

'విత్తన లభ్యత, సాంకేతిక మద్దతు, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, మిల్లుల ఏర్పాటు వంటి అంశాలపై ప్రధాన పెట్టుబడులను పెట్టనున్నాం. ఆయిల్ పామ్ సాగుకు సంబంధించి రాష్ట్రాలకు కేంద్రం సంపూర్ణ మద్దతు ఇస్తుంది. రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి. సేంద్రియ ఎరువుల వినియోగం పెంచే విధంగా చర్యలు వేగంగా తీసుకోవాలి. సహజ, ప్రకృతి, సేంద్రియ సాగుకు సంబంధించి తెలుగు రాష్ట్రాలు ముందుకు వెళ్తున్నాయి.' -నరేంద్రసింగ్ తోమర్, కేంద్రమంత్రి

వంట నూనెల కోసం నేషనల్ మిషన్

వంట నూనెల విషయంలో ఆత్మనిర్భర్ చేయడం కోసం దాదాపు రూ.11 వేల కోట్లతో నేషనల్ మిషన్ చేపట్టామని వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి అన్నారు. ఇందులో దాదాపు రూ.2,200 కోట్ల వరకు రాష్ట్రాలు భరిస్తాయని తెలిపారు. ప్రభుత్వం, పరిశోధన రంగాలు, రైతులు కలసి ఈ ప్రణాళికని విజయవంతం చేయాలని సూచించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయటంలో ఈ కార్యక్రమం దోహదం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

మద్దతు ధర అవసరం

Niranjan reddy about oil palm : ఆయిల్‌ పామ్ సాగు విస్తీర్ణం పెంచడానికి.. రూ.15 వేల కనీస ధర అందించాలని, బిందు సేద్యం రాయితీ పెంచాలని కేంద్రానికి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 30 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు చేయడమే లక్ష్యంగా సాగుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఆయిల్ పామ్​కు సంబంధించి సింగిల్ విండో ద్వారా అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

'డ్రిప్ ఇరిగేషన్ రాయితీలు పెంచాలి. ఏడేళ్ల పరిమితి ఎత్తివేయాలి. పంట మార్పిడి కోసం సూక్ష్మ ప్రణాళికలు సిద్ధం చేసింది. కనీస మద్దతు ధరను ఆయిల్ పామ్​కు పెంచాలి.' -మంత్రి నిరంజన్ రెడ్డి

ఈ కార్యక్రమంలో కేరళ మంత్రి పి.ప్రసాద్, వ్యవసాయ శాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రిలోచన్ మహాపాత్ర, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఉద్యాన శాఖ డైరెక్టర్ లోక వెంకటరామిరెడ్డి, ఆయిల్ పామ్ రైతులు, శాస్త్రవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు, అంకుర సంస్థల ప్రతినిధులు తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు.

కీలక అంశాలపై చర్చ

వాతావరణ మార్పుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా.. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఆయిల్‌పామ్ పంట సాగు విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదతక పెంపు, రైతులకు ఇతోధిక రాయితీ, ఇతర ప్రోత్సాహకాలు, ఆదాయాలు పెంపు, ఆయిల్ పరిశ్రమ బలోపేతం, ఈ రంగంలో యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. పామాయిల్ వినియోగంలో ఇండోనేషియా అగ్రస్థానంలో ఉండగా.. భారత్‌ రెండో స్థానంలో ఉంది.

ఇదీ చదవండి:AP Crime Report: రాష్ట్రంలో నేరాలపై వార్షిక నివేదిక విడుదల

ABOUT THE AUTHOR

...view details