ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏ దరికి చేరునో.. రఘురామరాజకీయం..! - raghuramakrishna raju fiers on ycp

మాటకు మాట అన్నరీతిలో సాగిన ఎంపీ రఘురామకృష్ణరాజు పంచాయితీ స్పీకర్​ వరకు చేరింది. పార్లమెంట్​లో తెలుగుభాషపై చేసిన వ్యాఖ్యలతో మొదలైన వివాదం ...షోకాజ్ నోటీసులు జారీ చేసే వరకు వచ్చింది. అంతేకాదు షోకాజ్ పై తనదైన స్టైల్​లో రిప్లై ఇచ్చారు రాజుగారు. సమస్య తీవ్రత గుర్తించిన వైకాపా.... సభాపతికి ఫిర్యాదు చేసింది. అయినా వెనక్కితగ్గని నరసాపురం ఎంపీ...హైకోర్టును ఆశ్రయించారు.

narsapuram mp raghuramakrishna raju
narsapuram mp raghuramakrishna raju

By

Published : Jul 3, 2020, 7:52 PM IST

Updated : Jul 3, 2020, 8:19 PM IST

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారం దిల్లీకి చేరింది. ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూసొంత పార్టీ ఎంపీలు స్పీకర్​కు ఫిర్యాదుచేశారు. రఘురామకృష్ణరాజు తీరుపై విమర్శల వర్షం కురిపించారు. ఏ పార్టీపై గెలిచారో ఆ పార్టీపైనే ఇరుకుపెట్టేలా మాట్లాడారని ఆరోపించారు. స్వపక్షంలో విపక్షంలా వ్యవహరిస్తూ... క్రమశిక్షణ తప్పారని తేల్చేశారు.

'రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు పిటిషన్ ఇచ్చాం. అన్ని విషయాలు పరిశీలించాక చర్యలు తీసుకుంటానని స్పీకర్ హామీ ఇచ్చారు. ఏ పార్టీ తరఫున ఎంపీగా ఉన్నారో ఆ పార్టీపైనే రఘురామకృష్ణరాజు ఆరోపణలు చేస్తున్నారు. స్వపక్షంలో విపక్షంలా రఘురామకృష్ణరాజు ప్రవర్తిస్తున్నారు. రఘురామకృష్ణరాజు పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారు. ఊహాజనితమైన విషయాలను ఊహించుకుని ప్రజలకు సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏదైనా అసంతృప్తి ఉంటే పార్టీ అధినేత దృష్టికి తీసుకురావాలి. రఘురామకృష్ణరాజు క్రమశిక్షణను ఉల్లంఘించినట్లు స్పష్టంగా కనబడుతోంది. బహిరంగంగా పార్టీ నియమావళి, క్రమశిక్షణను ఉల్లంఘించారు' -విజయ సాయిరెడ్డి

వైఎస్​ఆర్ అంటే తప్పులేదు : మిథున్ రెడ్డి

రఘురామకృష్ణరాజుకు సీఎం జగన్ సముచిత స్థానం కల్పించారని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. సొంత పార్టీ నేతలపై దూషణలు చేయటం సరికాదని అభిప్రాయపడ్డారు. తెదేపా నేతల ప్రోద్బలంతోనే రఘురామకృష్ణరాజు ఇలాంటి విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. తెదేపా నుంచి భాజపాకు వలస వెళ్లిన నేతల అండతోనే మాట్లాడుతున్నారన్న ఆయన... వైఎస్ఆర్‌ అంటే కూడా యువజన శ్రామిక రైతు పార్టీనే అని హితవు పలికారు.

అక్కడ్నుంచే మొదలు...

రాష్ట్రంలో ఆంగ్ల బోధనను తప్పనిసరిగా చేస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న క్రమంలో.. రఘురామకృష్ణరాజు... పార్లమెంట్​లో తెలుగుభాష ప్రాధాన్యతపై చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంపై పార్టీ అధిష్ఠానం సీరియస్​గానే తీసుకుంది. కొంత సద్దుమణిగిందనుకున్నప్పటికీ... అనంతరం ఎంపీ వ్యవహారం ఏదో ఒక సమయంలో చర్చకు వస్తూనే ఉంది. తిరుమల ఆస్తుల వేలాన్ని బహిరంగగానే వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి సూచనలు చేశారు. అంతేకాదు కొందరూ వైకాపా ఎమ్మెల్యేలు అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడుతున్నారని...పేదల ఇళ్ల స్థలాల్లో భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. సీఎం అపాయింట్​మెంట్ ఇవ్వట్లేదని మీడియా ముఖంగానే చెప్పారు. ఈ క్రమంలో వైకాపా నేతలు ఆయన మాటలు తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ఇలా మాటమాట పెరిగి పరస్పర విమర్శలు చేసుకునేంత వరకు వచ్చింది. ఒకానొక దశలో సీఎం జగన్​ను ఉద్దేశిస్తూ పరోక్షంగా ఘాటైన వ్యాఖ్యలు చేశారాయన.

రక్షణ కోరుతూ ఫిర్యాదులు

తనకు కొందరు వైకాపా ఎమ్మెల్యేల నుంచి ప్రాణహాని ఉందని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అంతేకాదు తనకు భద్రత కల్పించాలని కోరుతూ లోక్​సభ స్పీకర్​తో పాటు కేంద్ర హోంశాఖను అభ్యర్థించారు.

షోకాజ్ నోటీసు

ఎంపీ రఘురామకృష్ణరాజుకు.. వ్యాఖ్యలపై పార్టీ అధిష్ఠానం షోకాజ్ నోటీసులు జారీచేసింది. ప్రభుత్వం పథకాలు, పార్టీ విధానాలపై బహిరంగంగా విమర్శలు చేశారన్న ఆరోపణలపై నోటీసులు ఇచ్చినట్లు ప్రకటించింది. వారం రోజుల్లో వివరణ ఇవాల్సిందింగా ఆదేశించింది. సమాధానం ఇవ్వని పరిస్థితుల్లో చర్యలు తీసుకుంటామని నోటీసులో హెచ్చరించింది. వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ఈ నోటీసు జారీ చేశారు.

ఘాటు రిప్లే

అధిష్ఠానం జారీ చేసిన షోకాజ్ నోటీసుకు ఎంపీ రఘురామకృష్ణరాజు ఘాటుగా జవాబునిచ్చారు. అసలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అనే లెటర్‌హెడ్‌పై లేఖ ఎలా పంపిస్థారని ప్రశ్నించారు. తాను గెలిచింది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ తరపున అని బదులిచ్చారు. తనకు షోకాజ్‌ నోటీసు ఇచ్చే అధికారం వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డికి అసలు ఉందా? లేదా? అని నిలదీశారు. ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన క్రమశిక్షణ కమిటీ మన పార్టీకి ఉందా? ఉంటే దానికి ఛైర్మన్‌ ఎవరు? అందులో సభ్యులెవరున్నారని అడిగారు.

హైకోర్టులో పిటిషన్

తనపై అనర్హత వేటు, సస్పెన్షన్ చర్యలు అడ్డుకోవాలని ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు. తాను ఎలాంటి పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడలేదని పేర్కొన్నారు. యువజన శ్రామిక రైతు పార్టీ తరఫున షోకాజ్ నోటీసులు ఇవ్వలేదన్న రఘురామకృష్ణరాజు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ లెటర్‌హెడ్‌పై షోకాజ్ నోటీసులు ఇచ్చారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ పిటిషన్​ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

ఇలా వివిధ మలుపులు తిరుగుతున్న వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు పంచాయితీ వైకాపా ఫిర్యాదుతో సభాపతి కోర్టులో పడింది.

ఇదీ చదవండి:

రఘురామకృష్ణరాజుపై లోక్​సభ స్పీకర్​కు వైకాపా ఫిర్యాదు

Last Updated : Jul 3, 2020, 8:19 PM IST

ABOUT THE AUTHOR

...view details