పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తే 80 లక్షలమంది కరోనా బారిన పడే ప్రమాదముందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆందోళన చెందారు. దేశంలో అనేక రాష్ట్రాలు పరీక్షల రద్దు లేదా వాయిదా వేయడం వంటి నిర్ణయాలు తీసుకున్నాయని.. వైకాపా ప్రభుత్వం మొండిగా పరీక్షలు నిర్వహించాలని చూస్తోందని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల వాయిదాకు డిమాండ్ చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలతో ఆన్ లైన్ సమావేశాన్ని లోకేశ్ నిర్వహించారు. పరీక్షలకు సంబంధించి ప్రత్యేక వాట్సప్ నెంబర్ను లోకేశ్ విడుదల చేశారు. 94441 90000కు అభిప్రాయాలు పంపాలని కోరారు.
వైకాపా ప్రభుత్వం మొండి వైఖరితో విద్యార్థుల జీవితాలకే పరీక్ష పెడుతోందని లోకేశ్ అన్నారు. ప్రభుత్వం మొండిపట్టు వీడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో మార్పు వస్తేనే కరోనా కట్టడి సాధ్యమవుతుందని హితవు పలికారు. పరీక్షల నిర్వహణపై 48 గంటల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుంటే ఉద్యమిస్తామని లోకేశ్ హెచ్చరించారు. పది, ఇంటర్ పరీక్షలు వాయిదా లేదా రద్దు చేయాలన్నారు.