ఐపీసీ సెక్షన్లకు బదులు 'వైసీపీ సెక్షన్లు' అమలవుతున్నాయి: లోకేశ్
రఘురామకృష్ణరాజుని అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా థర్డ్‌డిగ్రీ ప్రయోగించటం దుర్మార్గమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ఏపీలో ఐపీసీ సెక్షన్లకు బదులుగా 'వైసీపీ సెక్షన్లు' అమలవుతున్నాయని విమర్శించారు.
రఘురామకృష్ణరాజుని అక్రమంగా అరెస్ట్ చేయడం, థర్డ్‌డిగ్రీ ప్రయోగించటం దుర్మార్గమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. శాంతి భద్రతలు అమలు చేయాల్సిన పోలీసులు... జగన్ రెడ్డి పార్టీ కార్యకర్తల్లా అరాచకాలకు తెగపడుతున్నారని ధ్వజమెత్తారు. ఏపీలో ఐపీసీ సెక్షన్లకు బదులుగా వైసీపీ సెక్షన్లు అమలవుతున్నాయని విమర్శించారు. అరాచకపాలనపై ప్రధానమంత్రి, రాష్ట్రపతి, లోక్ సభ స్పీకర్, రాష్ట్ర గవర్నర్ సత్వరమే స్పందించాలన్న లోకేశ్... కేంద్ర బృందాలతో న్యాయ విచారణ జరిపించి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలుచేస్తున్న జగన్‌రెడ్డి రాక్షసపాలనలో ఓ ఎంపీని కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా అరెస్టు చేయటంతో పాటు చిత్రహింసలు పెట్టారని ఆక్షేపించారు. వైకాపా ఎంపీకే ఈ దుస్థితి ఎదురైతే ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే ప్రజలకు రక్షణ ఎక్కడుందని నారా లోకేశ్ నిలదీశారు.