గ్రూప్-1 అభ్యర్థుల ఇంటర్వ్యూలు నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువత భవితని దెబ్బతీసే విధంగా గ్రూప్-1 పరీక్షల్లో జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ అవకతవకలకు పాల్పడ్డారని ట్విట్టర్లో లోకేశ్ ఆరోపించారు. ఏపీపీఎస్సీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చి.. వేలాది మంది అభ్యర్థులకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు.
దొడ్డిదారిలో తమ వారికి ఉద్యోగాలు ఇప్పించుకోవడానికి చేసిన కుట్ర బయటపడిందని విమర్శించారు. విజయానికి ఇది మొదటి మెట్టని.. ఆఖరికి న్యాయమే గెలుస్తుందని అన్నారు. అభ్యర్థులంతా ధైర్యంగా ఉండండని భరోసా నిచ్చారు. అర్హులైన వారికే ఉద్యోగాలు అనే డిమాండ్‌తో మన పోరాటం కొనసాగిద్దామని అని ట్వీట్ చేశారు.
జె టాక్స్‌లు చెల్లించలేకే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వెళ్లిపోతోంది..
జె టాక్స్‌లు చెల్లించలేకే రాష్ట్రం నుంచి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వెళ్లిపోతోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ప్రపంచ ప్రఖ్యాత 500 కంపెనీల్లో ఒక్కటైన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ గొప్పతనం జగన్‌రెడ్డికి తెలుసు కాబట్టే 9 కోట్ల షేర్లు కొని పెట్టుబడిగా ఉంచారన్నారు. అంతటి కంపెనీని ఎన్నో కష్టనష్టాలకోర్చి రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుదేనని గుర్తుచేశారు. 5 రూపాయల కోసం టిక్‌టాక్‌లో బైబై బాబూ అని పెయిడ్ వీడియోలు పెట్టిన పేటీఎం కూలీలు.. ఇప్పుడు బైబై ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వీడియోలు పెట్టాలని ఎద్దేవా చేశారు.