చంద్రబాబు తెచ్చిన కియా పరిశ్రమకు జగన్ మళ్లీ రిబ్బన్ కట్ చేశారని... తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. తెదేపా చేసిన అభివృద్ధి, సంక్షేమానికి పేర్లు మార్చడం, రంగులేయడం.. మళ్లీ మళ్లీ ప్రారంభోత్సవాలు చేయడం 'క్యా కియా జగన్ సాబ్' అంటూ లోకేశ్ ఎద్దేవా చేశారు. జగన్ చేతకానితనంతో దేశమంతా ఏపీని చూసి నవ్వుతోందన్నారు. 'కమీషన్ల కోసమే చంద్రబాబు కియా తెచ్చారన్నారు కదా... అదే పరిశ్రమ ప్రారంభోత్సవానికి మీకెంత ముట్టిందో చెప్పాలి' అని ట్విటర్ వేదికగా నిలదీశారు లోకేశ్.
'చంద్రబాబు తెచ్చిన కియాకు... జగన్ మళ్లీ రిబ్బన్ కట్ చేశారు' - ఏపీలో ఉల్లి సమస్యలు
వైకాపా పాలనపై నారా లోకేశ్ ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. జగన్ అసమర్థ పాలన కారణంగా దేశమంతా ఏపీని చూసి నవ్వుతోందని పేర్కొన్నారు. 6 నెలల పాలనలో ప్రజలు ఇసుక కోసం ధర్నాలు, ఉల్లి కోసం ఉద్యమాలు చెయ్యాల్సిన దుస్థితి వచ్చిందని దుయ్యబట్టారు.
ఇసుక కోసం ధర్నాలు... ఉల్లి కోసం ఉద్యమాలు...
6 నెలల జగన్ పాలనలో ప్రజలు ఇసుక కోసం ధర్నాలు, ఉల్లి కోసం ఉద్యమాలు చెయ్యాల్సిన దుస్థితి వచ్చిందని నారా లోకేశ్ విమర్శించారు. కేజీ ఉల్లిపాయల కోసం ప్రజల ప్రాణాలు తీసే పరిస్థితికి వచ్చిందని మండిపడ్డారు. విజయనగరంలో పరిస్థితి ఇది అంటూ... ట్విటర్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. గతంలో చంద్రబాబు పరిపాలనలో ఉల్లిపాయల ధరలు పెరిగితే... రేషన్ షాపుల ద్వారా సబ్సిడీపై సరఫరా చేసి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేశారని గుర్తుచేశారు. 30 మంది సలహాదారులను పెట్టుకొని కూడా ప్రజలను ఇబ్బంది పెట్టడం మంచిది కాదంటూ ట్వీట్ చేశారు.