ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అప్పుడేమైపోయింది సీఐడీ... వైకాపా అక్రమాలపై అరెస్టులేవీ? - తెదేపా కార్యకర్తల అరెస్టుపై లోకేశ్

రాజారెడ్డి రాజ్యాంగంలో సీఐడీని సామాజిక మాధ్యమాల వేధింపుల విభాగంగా మార్చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆరోపించారు. తెదేపా కార్యకర్త కృష్ణ కిశోర్ అరెస్టుపై ఆయన మండిపడ్డారు. ఏం నేరం చేశారని అర్ధరాత్రి అరెస్టు చేశారని ప్రశ్నించారు. వైకాపా ఎన్ని అక్రమాలకు పాల్పడినా నోరుమెదపని సీఐడీ...అమాయకులను అరెస్టు చేస్తోందని ఆరోపించారు.

Nara lokesh
Nara lokesh

By

Published : Jun 23, 2020, 12:42 PM IST

వైకాపా ఎన్ని అరాచకాలు చేసినా నోరుమెదపని సీఐడీ... అమాయకులపై ప్రతాపం చూపిస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. ఇసుక అక్రమాలు, ఇళ్ల స్థలాలు అమ్మకాలు, ఇళ్ల స్థలాల కొనుగోలు పేరుతో కోట్లు కొల్లగొట్టినప్పుడు, విషం కన్నా ప్రమాదకరమైన మందు పోస్తూ వేల కోట్లు జే ట్యాక్స్ వసూలు చేసినప్పుడు, 108 స్కామ్, మైన్స్ మింగేసినప్పుడు సీఐడీ ఏమైపోయిందని ఆయన ప్రశ్నించారు. వైకాపా నేతలు మహిళలను వేధించినప్పుడు సీఐడీ ఎక్కడుందని మండిపడ్డారు.

రాజారెడ్డి రాజ్యాంగంలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్​మెంట్​ని సామాజిక వేధింపుల డిపార్ట్​మెంట్​గా జగన్ మార్చేశారని లోకేశ్‌ దుయ్యబట్టారు. భావ ప్రకటన స్వేచ్ఛని హరించే హక్కు వైకాపాకు ఎవరిచ్చారని ఆక్షేపించారు. ఏం నేరం చేశారని అర్ధరాత్రి చొరబడి తమ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. కృష్ణ కిషోర్​కి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. జగన్ పాలన గురించి వైకాపా ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలే మీడియా ముఖంగా విమర్శిస్తున్నారన్న లోకేశ్.. వారిని కూడా సీఐడీ అరెస్టు చేస్తుందా? అని నిలదీశారు.

ఇదీ చదవండి :తెదేపా సోషల్ మీడియా కార్యకర్త చిరుమామిళ్ళ కృష్ణారావు అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details