సీఎం జగన్కు ఒక్క అవకాశం ఇచ్చినందుకు రాష్ట్రానికి ఎన్ని కష్టాలో, నష్టాలో, అనర్థాలో.. అంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. రివర్స్ టెండరింగ్ పేరుతో బడుగు, బలహీన వర్గాలకు టెండర్ పెట్టిన జగన్... ఇప్పుడు పేద ప్రజల పొట్టకొట్టారని ఆక్షేపించారు. 7 లక్షల పింఛన్లు తీసివేశారని ట్వీట్ లో అన్నారు.
మొన్నటి వరకూ ఒక్క పింఛన్ కూడా తియ్యలేదని బుకాయించిన వైకాపా ప్రభుత్వం, రీవెరిఫికేషన్ పేరుతో కొత్త డ్రామా ఎందుకు మొదలుపెట్టిందని నిలదీశారు. 20 లక్షల రేషన్ కార్డులు తీసివేసి పేదవాడి నోటి దగ్గర కూడు లాగేసుకున్నారని ఆవేదన చెందారు. జగన్కు ఊరుకో రాజభవనం ఉండొచ్చు కానీ.. పేద వాడు అద్దె ఇంట్లో ఉంటే చెత్త రూల్స్ పెట్టి రేషన్ కార్డు తీసేస్తారా అని ప్రశ్నించారు. పేదవాడి పొట్ట కొట్టి రూ.1500 కోట్లు మిగుల్చుకొని ఏం సాధిస్తారని నిలదీశారు. ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు, రేషన్ కార్డులు ఎత్తేస్తున్న సీఎం జగన్... సంక్షేమ వ్యతిరేకిగా చరిత్రలో మిగిలిపోతారని లోకేశ్ అన్నారు.