రాష్ట్ర ప్రభుత్వం కోనసీమ రైతుల సమస్యల్ని పరిష్కరించాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. రైతులతో పంట విరామ ప్రకటన విరమింపజేయాలన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి తోడ్పాటు లేక.. రైతులు విరక్తితో పంటవిరామం ప్రకటించడం దురదృష్టకరమని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే బాధిత గ్రామాల్లో ప్రోత్సాహకాలు అందించి తిరిగి పంటలు వేసేలా చూడాలని ప్రభుత్వానికి సూచించారు. ఏటా మూడు పంటలు పండే ప్రాంతంలోనూ విరామం ప్రకటించటం బాధాకరమని చెప్పారు.
సఖినేటిపల్లి, మలికిపురం, రాజోలు, మామిడికుదురు, అల్లవరం, అమలాపురం, ఉప్పలగుప్తం, అయినవిల్లి, కాట్రేనికోన, ముమ్మిడివరం మండలాలలో ఏటా వేలాది ఎకరాలు ముంపునకు గురవుతున్నాయని లోకేశ్ అన్నారు. దీనికితోడు పరిహారం సకాలంలో అందకే 2011 తర్వాత మళ్లీ పంటవిరామం ప్రకటించారని పేర్కొన్నారు. రైతుల ఇబ్బందులు అర్థం చేసుకుని ప్రభుత్వం వెంటనే వారితో చర్చించాలని విజ్ఞప్తి చేశారు. రైతుల ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని లోకేశ్ డిమాండ్ చేశారు.