దేవాలయాల్లో జరుగుతున్న ఘటనలపై సీఎం జగన్ స్పందించకపోవడం హిందువుల్లో అనేక అనుమానాలకు తావిస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. హిందువుల మనోభావాలు దెబ్బ తినేలా రాష్ట్రంలో అనేక సంఘటనలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. దేవతా విగ్రహాల ధ్వంసం, రథాలకు నిప్పు, పూజారులపై దాడులు, ఆలయ భూముల అమ్మకం, గోశాలల్లో గోవుల మృత్యుఘోష ఇలా వరుస ఘటనలు చోటుచేసుకుంటుండటాన్ని తప్పుబట్టారు.
అరవై ఏళ్లుగా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవానికి ఉపయోగించిన రథం దగ్ధం కావడంతో హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మతిస్థిమితం లేని వ్యక్తి చేశాడని ఓసారి, షార్ట్ సర్క్యూట్ అని, పేకాట ఆడే బ్యాచ్ వలన ప్రమాదం జరిగిందంటూ బాధ్యతారాహిత్యంగా ప్రకటనలు చేయడం తగదని అన్నారు. రథం దగ్ధం ఘటనపై సీబీఐతో దర్యాప్తు జరిపి.. ఈ ఘటనల వెనుక ఉన్న ముఖ్య పాత్రదారులు ఎవరో బయటపెట్టాలని కోరారు.