ఈ నెలాఖారులోగా విపత్తులతో నష్టపోయిన అన్నదాతలను ఆదుకోకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హెచ్చరించారు. ఒక్క ఖరీఫ్ సీజన్లోనే 10వేల కోట్ల పంటలు దెబ్బతిని రైతులు కుదేలయ్యారని అన్నారు. ఈ మేరకు సీఎం జగన్కు లేఖ రాశారు. వ్యవసాయ పంటలకు హెక్టారుకు రూ.30వేలు, ఉద్యాన పంటలకు రూ.50వేలు చెల్లించాలన్నారు. పంట నష్టాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు.
పంటల బీమా చెల్లింపు సక్రమంగా అమలయ్యేలా చూడాలని లేఖలో కోరారు. వర్షాలకు దెబ్బతిన్న మొత్తం పంటను ప్రభుత్వమే కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యామ్నాయ పంటలకు విత్తనాలు, ఎరువులు ఉచితంగా అందించాలని సూచించారు. వరుస విపత్తులతో పంటలు తీవ్రంగా నష్టపోయినా రైతులను ఆదుకునే ఎలాంటి చర్యలు ప్రభుత్వం చేపట్టలేదని మండిపడ్డారు.