Lokesh Letter to CM Jagan: రాష్ట్రంలో ఈఏపీసెట్ విద్యార్థుల అడ్మిషన్ కౌన్సెలింగ్‌లో తీవ్ర నిర్లక్ష్యం జరుగుతోందని సీఎంకు లోకేశ్ లేఖ రాశారు. ప్రభుత్వం విద్యార్థుల ఫిర్యాదులను విస్మరించడం తగదని.., వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సాంకేతిక సమస్యలు, అసంబద్ధ విధానాలతో విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడేయడం సరికాదన్నారు.
Lokesh On EAPCET 2021: ప్రభుత్వ కళాశాలల్లో కన్వీనర్, స్పోర్ట్స్, ఎన్సీసీ కోటాల కింద 1,12,932 సీట్లు కేటాయించబడ్డాయని.., ఈఏపీసెట్ -2021 పరీక్షలో దాదాపు 1.34 లక్షల మంది విద్యార్థులు అర్హత సాధించారని లోకేశ్ పేర్కొన్నారు. వారిలో మొదటి విడతలో 90,606 మంది విద్యార్థులు కౌన్సెలింగ్‌కు నమోదు చేసుకోగా.. 80,935 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారని పేర్కొన్నారు. 2వ విడతలో 1533 మంది నమోదు చేసుకుంటే.. 3435 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారని తెలిపారు. ప్రభుత్వ కోటా కింద కేటాయించిన 1.12 లక్షల సీట్లకుగానూ 84,370 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయని.. దాదాపు 28వేల సీట్లకు పైగా ఖాళీగా ఉన్నప్పటికీ, ఇంకా ఏ సీటూ పొందని విద్యార్థులు 7600 మంది ఉన్నారని వివరించారు.
EAPCET 2021: రెండో రౌండ్ కౌన్సెలింగ్ ప్రకటించినప్పుడు అదే చివరి విడత కౌన్సెలింగ్ అని విద్యార్థులకు ఎటువంటి సమాచారమూ ఇవ్వలేదని లోకేశ్ విమర్శించారు. ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు, వెబ్‌సైట్ సాంకేతిక లోపాల కారణంగా సీట్లు కేటాయించని విద్యార్థులకు ఎటువంటి సమాచారమూ ఇవ్వలేదని మండిపడ్డారు. ఉన్నత విద్యామండలిని విద్యార్థులు సంప్రదించినప్పటికీ అధికారులు ఉదాసీనంగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని ఆరోపించారు.