తుగ్లక్ నిర్ణయాలతో విద్యార్థుల్ని బలిగొనకుండా పది, ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు రద్దు చేయాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ మతితప్పిన నిర్ణయాలు విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
మళ్లీ మళ్లీ అవే తప్పులు..
గత ఏడాది రెండు సార్లు పరీక్షలు వాయిదా వేసి రద్దు చేశారన్న లోకేశ్.. ఈసారీ అదే తప్పు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దూరదృష్టి లేని నిర్ణయాలతో విద్యా సంవత్సరం గందరగోళంలో పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జూలైలో పరీక్షలు పెట్టి ఫలితాలు ఇస్తే, అడ్మిషన్లు ప్రక్రియ పూర్తి చేసేసరికి అక్టోబర్ గడిచిపోతుందని పేర్కొన్నారు.
4 నెలల్లోనే ముగిస్తే లాభమేంటి ? : లోకేశ్
జూన్‌లో ప్రారంభం కావాల్సిన అకాడెమిక్ ఇయర్‌ను అక్టోబర్‌లో ప్రారంభించి.. నాలుగు నెలల్లోనే ముగిస్తే ఏం లాభమని ప్రశ్నించారు. 18-45 మధ్య వయసు వారికి సెప్టెంబర్ వరకూ వ్యాక్సిన్లు ఇవ్వలేమని సీఎం చెప్పినందున పిల్లలకు ఇప్పట్లో వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం లేదని ప్రస్ఫుటమైందన్నారు. ఫలితంగా అదే నెలలో పిల్లలపై తీవ్ర ప్రభావం చూపే కరోనా మూడో దశ ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు.
'మంత్రివర్గ సమావేశానికే దిక్కులేదు'
కొవిడ్ భయంతో 30 మంది కూడా లేని మంత్రివర్గ సమావేశం నిర్వహించలేని దుస్థితిలో ఉన్న సీఎం... లక్షలాది మంది పిల్లలకు పరీక్షల నిర్వహణ పేరుతో ప్రమాదంలోకి నెడతారా అని నిలదీసారు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈతో పాటు, 14 రాష్ట్రాలు 10, 11 తరగతుల పరీక్షలు రద్దు చేశాయని గుర్తు చేశారు. ఏపీ సీఎం మాత్రం మొండిగా పరీక్షలు నిర్వహిస్తామనటం మతి తప్పిన నిర్ణయమేనని విమర్శించారు. పరీక్షలు వాయిదాలతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల జీవితాలతో చెలగాటలాడటం ఇకనైనా ఆపాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
కాస్త ఉపశమనం: క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు