నిరుద్యోగుల ఉద్యమాన్ని నిర్బంధంతో అణిచివేయలేరని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. వైకాపా రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చుకున్న జగన్ రెడ్డి, రాష్ట్ర నిరుద్యోగ యువతికి ఉద్యోగాలు ఎక్కడో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తామని భ్రమలు కల్పించి వందల్లో కూడా ఇవ్వలేని అరాచక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు.
"అక్రమ అరెస్టులతో యువతను అడ్డుకోవాలనుకోవటం అసాధ్యం. కొత్త జాబ్ క్యాలెండర్ డిమాండ్ తో సీఎం ఇంటి ముట్టడి కార్యక్రమంలో నిర్బంధాలు, అక్రమ అరెస్టులకు ఎదురొడ్డి నిరసన తెలిపిన యువత ఉద్యమస్ఫూర్తి అభినందనీయం. అధికార పార్టీ కార్యకర్తల్లా కొందరు పోలీసులు దిగజారి పనిచేయటం విచారకరం. జరిగిన అన్యాయంపై నిరసన తెలిపేందుకు ఆర్టికల్ 19 ద్వారా రాజ్యాంగం కలిపించిన హక్కును పోలీసులు కాలరాయటం తగదు. యువత భవిష్యత్తు దెబ్బతీస్తామని గుంటూరు ఎస్పీ బెదిరించటం అరాచకత్వానికి నిదర్శనం. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని చూస్తున్న కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ అధికారుల వరకూ పునరాలోచన చేయాలి. ప్రజాధనంతో జీతభత్యాలు తీసుకుంటూ అధికారపార్టీకి ఊడిగం చేయటం మానుకోవాలి. నిర్బంధాలనెన్నింటినో అధిగమించి యువత సీఎం ఇంటిని ముట్టడించింది. ఇప్పటికైనా ఉద్యోగ పోరాట సమితి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుంటే మహోద్యమం తప్పదు. అప్పుడు ఎంతమంది పోలీసులు వచ్చినా ఆందోళనల్ని అడ్డుకోలేరు. విస్మరించిన హామీలను అమలు చేసేలా ఉద్యోగాల భర్తీకి కొత్త జాబ్ క్యాలెండర్ ను ముఖ్యమంత్రి విడుదల చేయాలి. అరెస్ట్ చేసిన విద్యార్థి, యువ నేతలందరినీ తక్షణమే విడుదల చేయాలి." అని డిమాండ్ చేశారు. యువత ఆందోళనలకు సంబంధించిన ఓ వీడియోను తన ట్విట్టర్ కు లోకేశ్ జత చేశారు.