కొవిడ్ చికిత్సకు పనికి రాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చి చెప్పిన రెమ్డిసివర్ ఇంజక్షన్ పేరు చెప్పి జగన్మోహన్ రెడ్డి కోట్లు కొల్లగొట్టారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. జగన్ బంధువు, సహచర వ్యక్తికి చెందిన కంపెనీ తయారు చేసే రెమ్డిసివర్ ఇంజక్షన్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముతూ జనాన్ని జలగల్లా పీల్చేస్తున్నారని ధ్వజమెత్తారు.
సీబీఐ, ఈడీ కేసుల భయంతో ప్రధానిని వ్యాక్సిన్ కోటా అడగలేక చంద్రబాబుపై ఏడుస్తారెందుకని లోకేశ్ మండిపడ్డారు. వ్యాక్సిన్ కి డబ్బు ఇవ్వకుండా కొవాగ్జిన్ చంద్రబాబు బంధువులది అని మళ్లీ నాటకాలెందుకని దుయ్యబట్టారు. కొవిషీల్డ్ కొనుగోలుకూ చంద్రబాబు అడ్డుపడ్డారా లేక 2 కంపెనీలు కమీషన్ ఇవ్వనన్నాయా అని నిలదీశారు. తన దొంగ బంధువుల కంపెనీ వ్యాక్సిన్ తయారు చేసే వరకూ ప్రజల్ని చంపేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నిస్సహాయత దేశమంతా తెలిసి పక్క రాష్ట్రాలు ఏపీ అంబులెన్స్ లనూ కూడా రానివ్వట్లేదని విమర్శించారు. ఇప్పటికైనా వ్యాక్సినేషన్ ప్రక్రియపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.