విద్యార్థుల ప్రాణాలంటే వైకాపా ప్రభుత్వానికి లెక్కలేదనే విషయం సుప్రీం కోర్టు వ్యాఖ్యలతో స్పష్టమైందని తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. పరీక్షల నిర్వహణకు కనీస ఏర్పాట్లు, ప్రాణాలకు రక్షణ చర్యలు చేపట్టకుండా మొండి పట్టుదలతో పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఏముందంటూ ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించటం సీఎం మూర్ఖత్వానికి పరాకాష్ట అని ఆరోపించారు. పరీక్షల నిర్వహణకు సరైన ప్రణాళిక లేని అఫిడవిట్ సమర్పించి చివాట్లు తిన్నారని దుయ్యబట్టారు.
ఇకనైనా చేసిన తప్పు సరిదిద్దుకుంటూ తక్షణమే పరీక్షల రద్దు నిర్ణయాన్ని సుప్రీం కోర్టుకు తెలపాలని నారా లోకేశ్ అన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రాణాలు బలితీసుకునే పరీక్షల నిర్వహణ ఆలోచనలకు ప్రభుత్వం స్వస్తి చెప్పాలని లోకేశ్ డిమాండ్ చేశారు.