సీఎం ఇంటి ముట్టడికి ప్రయత్నించిన టీఎన్ఎస్ఎఫ్ నాయకులను అరెస్ట్ చేయటాన్ని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే అరెస్టులేంటని మండిపడ్డారు. జగన్ పాలనలో బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్య చదువుకునే హక్కు లేదా అని నిలదీశారు. జీఓ 77 తీసుకొచ్చి వేలాది మంది విద్యార్థుల జీవితాలతో వైకాపా ప్రభుత్వం ఆటలాడుతోందని దుయ్యబట్టారు.
జీఓ నెంబర్ 77ను రద్దు చెయ్యాలని లోకేశ్ డిమాండ్ చేశారు. ప్రైవేట్ కాలేజీల్లో చదివే పీజీ విద్యార్థులందరికీ బోధనా రుసుము చెల్లించే పథకాన్ని పునరుద్ధరించాలన్నారు. విద్యార్థి వ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. దీనికి సంబంధించిన వీడియోను లోకేశ్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.