విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడే హక్కు వైకాపా ప్రభుత్వానికి లేదని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. విద్యా సంస్థల్లో కొవిడ్ తీవ్రత అధ్యయనానికి.. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. టీఎన్ ఎస్ఎఫ్, విద్యావేత్తలు, న్యాయనిపుణులతో కూడిన ఈ బృందం కొవిడ్ ఆందోళన పరిస్థితులపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని వివరించారు. టాస్క్ ఫోర్స్ బృందంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్‌గోపాల్, తెలుగు యువత నాయకుడు కిలారు నాగశ్రవణ్, న్యాయవాది వెంకటేశ్, విద్యావేత్తలు ఉన్నట్లు లోకేశ్ పేర్కొన్నారు.
"విద్యార్థుల పాలిట విషమంగా మారనున్న పరీక్షలు" అనే అంశంపై ఆన్లైన్లో.. విద్యార్ధి సంఘాలు, విద్యావేత్తలు, న్యాయనిపుణులతో లోకేశ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ .. ప్రభుత్వం విద్యార్ధుల ప్రాణాలకు పరీక్ష పెడుతోందని ధ్వజమెత్తారు. పదో తరగతి పరీక్షలు రద్దు చేసి ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. కరోనా కోరల్లో చిక్కుకున్నరాష్ట్రంలో.. పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం పునరాలోచన చేసి తీరాలన్నారు.