దేవినేని ఉమాను పోలీసులు అరెస్టు చేయటంపై.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. సవాళ్లు విసిరి పారిపోవటం జగన్ అండ్ గ్యాంగ్ డీఎన్ఏలోనే ఉందని లోకేశ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. చేసిన ఒక్క ఆరోపణ నిరూపించలేక జగన్ రెడ్డే తోకముడిచి తాడేపల్లిలో పడుకుంటే.. బూతుల మంత్రులెందుకు అనవసరంగా ఆవేశపడుతున్నారని ప్రశ్నించారు. దేవినేని ఉమా దమ్మున్న మగాడిలా చేసిన సవాల్‌ను.. ఎదురించలేక చేతగాని సన్న బియ్యం సన్నాసి పారిపోయారని ఎద్దేవా చేశారు.
మరోవైపు మంత్రి కొడాలి నాని గ్యాంబ్లింగ్ ముఠాకు నాయకుడని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. గుడివాడలో చెరువుగట్లపై పేకాట శిబిరాలు నడిపే వ్యక్తి, తన అవినీతిపై సమాధానం చెప్పుకోలేక దేవినేనిని అరెస్ట్ చేయించారని ధ్వజమెత్తారు. ఉమా రమ్మన్నచోటికి వచ్చే ధైర్యం లేక, ఫోన్లు చేశానంటున్నారని ఆక్షేపించారు. గన్నవరంలో అడ్రస్ లేని ఆయన గొల్లపూడిలో వీరంగం సృష్టించేందుకు వచ్చారని విమర్శించారు.