ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో ఏ కుటుంబానికైనా భద్రత ఉందా?: చంద్రబాబు - సలాం కుటుంబం ఆత్మహత్య వార్తలు

రాష్ట్రంలో ఏ కుటుంబానికైనా భద్రత ఉందా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కోర్టు చీవాట్లు పెట్టినప్పుడైనా డీజీపీ తీరు మారి ఉంటే సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చి ఉండేది కాదని ఆయన విమర్శించారు. జగన్ అసమర్థ పాలన వల్ల కుటుంబాలు బలైపోతున్నాయనడానికి సలాం ఘటన ఓ ఉదాహరణ మాత్రమేనని తెలిపారు.

nara chandrababu naidu
nara chandrababu naidu

By

Published : Nov 12, 2020, 2:46 PM IST

Updated : Nov 12, 2020, 5:24 PM IST

మీడియాతో చంద్రబాబు

కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన సలాం కుటుంబానిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో ఏ కుటుంబానికి భద్రత లేదన్న ఆయన... ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించాలని కోరారు. ప్రభుత్వ ఉదాసీనతే ప్రజల్లో అభద్రతను పెంచుతూ ఆత్మహత్యలను ప్రేరేపిస్తోందని విమర్శించారు. సమాజానికి నమ్మకం కలిగించేలా ప్రభుత్వం వ్యవహరించలేకపోతే ఇంకా ఈ తరహా ఘటనలు ఇంకా పెరిగిపోతాయని చంద్రబాబు అన్నారు.

ట్వీట్ పెట్టాకే కదలిక

ఆత్మహత్యకు ముందు సలాం కుటుంబం తీసుకున్న సెల్ఫీ వీడియో చూస్తే ఎంతటి కఠినాత్ములైనా తట్టుకోలేరని చంద్రబాబు అన్నారు. భరించలేనంత వేధింపులకు గురిచేసి కుటుంబం మొత్తాన్ని బలితీసుకున్నారని ధ్వజమెత్తారు. సలాం కుటుంబసభ్యుల వీడియో విడుదల చేసే వరకూ వాస్తవాలు బయటకు రాలేదన్న ఆయన.. ఆ తర్వాత కూడా పోలీసులు తగు రీతిలో స్పందించలేదని విమర్శించారు. తాను ట్వీట్ పెట్టాకే అధికారుల్లో కదలిక వచ్చిందని చెప్పారు. సలాం అత్త వీడియోను బయటపెట్టక పోతే ఆత్మహత్యకు కారణాలు బయటపడేవి కాదన్నారు.

అది కొత్త నాటకం

సలాం కేసులో బాధ్యులకు తెదేపా న్యాయవాది వల్ల బెయిల్ వచ్చిందంటూ కొత్త నాటకానికి తెరలేపారని చంద్రబాబు ధ్వజమెత్తారు. న్యాయవాదుల వల్ల బెయిల్ వస్తుందా అని ప్రశ్నించారు. కేసు సక్రమంగా నమోదు చేస్తే విచారణకు ఇద్దరు ఐపీఎస్ అధికారులను పంపాల్సిన అవసరం ఏమిటని నిలదీశారు.

పోలీసులు ఇదే తీరు కొనసాగిస్తే భవిష్యత్తులో వాళ్లు కూడా బలికాక తప్పదు. వ్యవస్థలన్నీ నాశనం అయ్యాక ఎవరికీ భద్రత ఉండదు. పోలీసులతో తప్పులు చేయించి వాళ్లనీ ఇబ్బంది పెట్టే రోజులు తెస్తారనేది గమనించాలి. పుంగనూరు ఓం ప్రకాష్ ఘటనపై డీజీపీ దగ్గర సమాధానం ఉందా?. ఒక ప్రతిపక్ష నేతగా నేను తప్పులను ప్రశ్నించకూడదా?. ప్రజలకు సమాధానం చెప్పకుండా మమ్మల్ని సాక్ష్యాలడిగే పరిస్థితిలో పోలీసులున్నారు. హైకోర్టు చీవాట్లు పెట్టినప్పుడైనా డీజీపీ తీరు మారి ఉంటే సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చి ఉండేది కాదు. మరోవైపు శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా తితిదే వ్యవహరిస్తోంది. ఒక ఆటవిక రాజ్యంతో ముందుకుపోతున్నారు-చంద్రబాబు, తెదేపా జాతీయ అధ్యక్షుడు

ఇదీ చదవండి

యథేచ్ఛగా చౌక బియ్యం అక్రమ రవాణా.. పట్టించుకోని అధికారులు

Last Updated : Nov 12, 2020, 5:24 PM IST

ABOUT THE AUTHOR

...view details