నందమూరి తారక రామారావు రాజకీయ జీవితం అంతా కలిపితే పద్నాలుగేళ్లు కూడా ఉండదు. అంత తక్కువ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేసిన వాళ్లు మరొకరు లేరు. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండా ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. అయినా, తెలుగుదేశం పార్టీకి గట్టి సిద్ధాంత పునాది కల్పించారు. రాష్ట్రాల హక్కుల కోసం ఎడతెగని పోరాటం చేశారు. కేంద్రం పెత్తనాన్ని ఎదుర్కొన్నారు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే కమ్యూనిస్టులు, భాజపా నేతలను ఒకతాటి మీదకు తీసుకువచ్చారు. 1989లో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడటంలో ముఖ్య భూమిక పోషించారు. నటుడిగానే కాకుండా, రాజకీయ నాయకుడిగా కూడా సామాన్య ప్రజానీకం మీద అంత ప్రభావం చూపిన వ్యక్తి తెలుగునాడులో మరొకరు లేరు.
ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో అనేక అబ్బురపరిచే అంశాలున్నాయి. అరవై ఏళ్ల వయసులో రాజకీయరంగ ప్రవేశమొక్కటే విశేషం కాదు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారాన్ని చేజిక్కించుకున్న ఆయన రికార్డును అన్నాడీఎంకే నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వరకు ఇంతవరకు ఎవరూ అధిగమించలేదు. ఉత్తర భారతంలో విస్తృతంగా పర్యటించి, హరియాణా నుంచి అసోం వరకు జనాన్ని ఉర్రూతలూగించిన దక్షిణాదికి చెందిన ఏకైక నాయకుడు ఎన్టీఆరే.
ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండానే ప్రజా జీవితంలోకి వచ్చినా.. రాష్ట్రాల స్వతంత్ర ప్రతిపత్తిని, సమాఖ్య వ్యవస్థ అవసరాన్ని నొక్కిచెప్పి తనదైన ఒక సైద్ధాంతిక పునాదిని ఎన్టీఆర్ ప్రతిపాదించారు. ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడైనా జాతీయ ప్రత్యామ్నాయం కోసం అహర్నిశలూ కృషి చేశారు. కాషాయ వస్త్రాలను ధరించినా లౌకికవాదాన్ని బలంగా నమ్మారు. తెలుగు ఆత్మగౌరవ నినాదంతో వచ్చినా, జాతీయవాదిగా నిలబడ్డారు. సంక్షేమ పథకాలకు మారుపేరుగా నిలిచినా, ప్రైవేటు రంగ ప్రాధాన్యాన్ని గుర్తించారు. భూస్వామ్య నేపథ్యం నుంచి వచ్చినా, పాలనావ్యవస్థలో పెనుమార్పులు తీసుకువచ్చారు. రాజకీయాన్ని వృత్తిగా కాకుండా లక్ష్యసాధనకు మార్గంగా పరిగణించారు. రాజకీయ పదవులను తృణప్రాయంగా చూశారు.
అంతర్జాతీయ యవనికపై తెలుగు బావుటా..!