ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Nandamuri Family: 'మెజారిటీ ఉందని... ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు' - వైకాపాకు నందమూరి ఫ్యామిలీ కౌంటర్

ఆత్మగౌరవ నినాదంతో తెలుగువారి సత్తా చాట్టారు ఎన్టీఆర్. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కొద్దిరోజుల్లోనే చరిత్ర సృష్టించారు. కానీ ఆయన కుటుంబం నుంచి పెద్దగా రాజకీయాల్లోకి ఎవరూ రాలేదు..! ఒక్కరిద్దరూ రాజకీయాల్లోకి వచ్చినా.. మిగతవారూ వేర్వురు రంగాల్లో ఉంటూ స్థిరపడ్డారు.! కానీ ఒక్కసారిగా ఆ కుటుంబమంతా కలిసి మీడియా ముందుకు వచ్చింది. సామాజిక మాధ్యమాల్లోనూ వారి కుటుంబసభ్యులు.. ఒకే గొంతుకను వినిపించారు. చంద్రబాబు భార్య భువనేశ్వరిపై వైకాపా నేతల అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ.. తామంతా ఒక్కటేననే గట్టి సందేశాన్ని ఇచ్చారు. ఇలాంటి వ్యాఖ్యలను సహించబోమని తేల్చి చెప్పారు.

Nandamuri Family
Nandamuri Family

By

Published : Nov 20, 2021, 11:08 PM IST

Updated : Nov 21, 2021, 11:31 AM IST

Nandamuri Family

నందమూరి కుటుంబం ఒక్కటిగా ముందుకొచ్చింది. చంద్రబాబు భార్య భువనేశ్వరికి అండగా నిలిచింది. చాలా సందర్భాల్లో ఒక వేదికపై వచ్చి ఆనందగా గడిపే వాళ్లు.. ఈసారి మాత్రం భిన్నమైన కారణంతో ఎంట్రీ ఇచ్చారు. తమ తోబుట్టువు భువనేశ్వరికి మద్దతుగా.. సభ లోపల, బయట.., వారి వెనుక ఉన్న శక్తుల నిజస్వరూపాన్ని ఎండగట్టేందుకు ఈ వేదికను ఎంచుకున్నారు. వైకాపా నేతల అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కౌంటర్ ఇచ్చారు. హద్దులు దాటి మాట్లాడొద్దంటూ.. తమదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. మహిళలపై వ్యక్తిగత విమర్శలు చేయటం దారుణమన్న వారు.. తీరు మార్చుకోపోతే భరతం పడతామని హెచ్చరించారు.ఈ పరిణామాలపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని, సంబంధిత నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నందమూరి స్వాతి కళ్యాణ్‌రామ్‌, నందమూరి జయశంకర కృష్ణ, గారపాటి లోకేశ్వరి, గారపాటి శ్రీనివాస్‌, నందమూరి వసుంధర, నందమూరి సుహాసిని, నందమూరి చైతన్యకృష్ణ, కామినేని సీమంతిని, కంఠమనేని ఉమామహేశ్వరి, శ్రీనివాస ప్రసాద్‌, నందమూరి జయశ్రీ రామకృష్ణ సహా పలువురు ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులు మాట్లాడారు.

చేతులు కట్టుకుని కూర్చోలేదు

‘చంద్రబాబు కంట తడి ఎప్పుడూ చూడలేదు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అసెంబ్లీలోకి అడుగుపెట్టినట్లు లేదు. శాసనసభలో న్యాయవాదులు, మేధావులు చాలామంది ఉన్నారు. ఇలా జరుగుతోందేంటి అనుకుంటున్నా బయటకు చెప్పలేకపోతున్నారు. సభాపతి ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు.. ప్రభుత్వ పక్షంగా, ఏకపక్షంగా నడపడాన్ని గత అసెంబ్లీ సమావేశాల నుంచి చూస్తున్నాం. వారికీ భార్యా, పిల్లలు ఉన్నారు. మహిళా సాధికారతకు భువనేశ్వరి స్ఫూర్తి. సామాజిక బాధ్యత కింద హిందూపురం నియోజకవర్గానికి కంప్యూటర్లు, ప్రొజెక్టర్లు పంపారు. మీరెప్పుడైనా ఇలాంటివి చేశారా? దోచుకున్న సొమ్మంతా ఇళ్లలోకి చేర్చడం తప్ప ఇలాంటివి పట్టవు. కులాలు, మతాలు, ప్రాంతాలను చీల్చి ఓట్లు సంపాదించుకున్నారు. వారి కుటుంబ సమస్యను (వివేకానందరెడ్డి హత్యకేసు) పక్కదారి పట్టించేందుకు ఇంత నీచంగా నోరు పారేసుకున్నారు. మేం చేతులు కట్టుకుని కూర్చోలేదు. మహిళలను వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకుని మాట్లాడితే ఊరుకోం. మెజారిటీ ఉందని విర్రవీగుతూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు. ఇంతకాలం సహనంతో ఉన్నామంటే చంద్రబాబుపై గౌరవంతోనే.. ఇక ఆయన అనుమతి అవసరం లేదు. ప్రజలు, కార్యకర్తలు, నా అభిమానులే మెడలు వంచి మిమ్మల్ని మారుస్తారు, ఖబడ్దార్‌.’- నందమూరి బాలకృష్ణ

ఆ నలుగురూ హద్దు మీరారు.. జాగ్రత్త

రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు చూస్తే బాధేస్తోందని నందమూరి రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. రెండు, మూడేళ్ల నుంచి చూస్తున్నాం.. చాలా బాధగా ఉందని అన్నారు. తమ కుటుంబం జోలికి ఎవరొచ్చినా వదిలిపెట్టమని నందమూరి రామకృష్ణ హెచ్చరించారు. ఇలాంటి పరిణామం ఏ కుటుంబానికి జరగకూడదని వాపోయారు. ద్వారంపూడి, కొడాలి నాని, వంశీ, అంబటి రాంబాబు హద్దులు మీరి ప్రవర్తించారని రామకృష్ణ హెచ్చరించారు. వ్యక్తిగత విషయాల జోలికి రావద్దని హెచ్చరించారు. సీతమ్మను చెరపట్టిన రావణాసురిడి చరిత్ర ఏమైందో అందరికీ తెలుసని..అదే గతి మీకూ పడుతుందని రామకృష్ణ అన్నారు.

వ్యక్తిగత దూషణలు ఉండకూడదు

మాట మన వ్యక్తిత్వానికి ప్రమాణం. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వసాధారణం. అవి ప్రజా సమస్యలపై జరగాలే గానీ, వ్యక్తిగత దూషణలు, విమర్శలు ఉండకూడదు. ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటన నా మనసును కలచివేసింది. ఆడపడుచుల గురించి పరుష పదజాలంతో మాట్లాడితే.. అది అరాచక పాలనకు నాంది పలుకుతుంది. స్త్రీ జాతిని గౌరవించటం మన సంస్కృతి. దాన్ని కలచివేసి, కాల్చేసి.. రాబోయే తరాలకు బంగారుబాట వేస్తున్నామనుకుంటే అది చాలా పెద్ద తప్పు. ఈ మాటలు నేను ఒక కుమారుడిగా.. ఒక భర్తగా.. ఒక తండ్రిగా.. ఈ దేశానికి చెందిన ఓ పౌరుడిగా, సాటి తెలుగువాడిగా మాట్లాడుతున్నా. రాజకీయ నాయకులకు ఒకటే విన్నపం. ఈ అరాచక సంస్కృతిని ఇక్కడే ఆపేయండి. ప్రజా సమస్యలపై పోరాడండి. - ట్విటర్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌

హుందాగా నడుచుకోవాలి
సాటి వ్యక్తిని, ముఖ్యంగా మహిళలను గౌరవించే మన సంప్రదాయంలో మహిళలను అసెంబ్లీలో దూషించే పరిస్థితి ఎదురు కావడం దురదృష్టకరం అని నందమూరి కళ్యాణ్ రామ్ అన్నారు. అందరూ హుందాగా నడుచుకోవాలి సూచించారు.

మా ఇంకో అవతారం చూస్తారు

అసెంబ్లీలో జరిగిన సంఘటన దురదృష్టకరం. చంద్రబాబు హయాంలో విజయమ్మ, భారతి, షర్మిలను ఒక్క మాట అనలేదు, ఎవర్నీ అననివ్వలేదు. ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం చాలా తప్పు. మాలోనూ ఎన్టీఆర్‌ రక్తమే ఉంది. మరోసారి ఇలాంటివి జరిగితే తెదేపా కార్యకర్తలు, తమ్ముళ్లు, చెల్లెళ్లు ఏకమవుతారు. మా ఇంకో అవతారం చూస్తారు. - గారపాటి లోకేశ్వరి

ఆ నాయకులకు వాళ్ల ఇళ్లలోని మహిళలే జవాబు చెప్పాలి

ఏది వినకూడదో, ఏది చూడకూడదో, ఏది మాట్లాడకూడదో.. అన్నీ విన్నాం. నందమూరి కుటుంబ సభ్యులందరికీ బాధగా, కోపంగా ఉంది. రాముడికి సీత ఎలాగో చంద్రబాబుకు భువనేశ్వరి అలాంటివారు. నందమూరి కుటుంబానికి భువనేశ్వరి శ్రీరామరక్ష. ఇలా మాట్లాడిన వారందరికీ వారింట్లోని ఆడవారే జవాబు చెప్పాలి. దేవుడే వారికి సమాధానం చెబుతారు. - నందమూరి వసుంధర, బాలకృష్ణ భార్య

అన్నా అని పిలిచే ఎన్టీఆర్‌ కూతురిపై అభాండాలా?
తెలుగు ప్రజలు అన్నా అని పిలుచుకునే నందమూరి తారకరామారావు కుమార్తె గురించి ఇలా మాట్లాడటం బాధాకరం. మా అత్త భువనేశ్వరిపై ఇలాంటి అభాండాలు వేయడం బాధగా ఉంది. ఆమె వ్యక్తిగత విషయాలు ఎప్పుడూ మాట్లాడలేదు. రాజకీయం రాజకీయ నాయకుల మధ్య ఉండాలి. కుటుంబ విషయాలు, కుటుంబసభ్యులు, మహిళలపై మాట్లాడకూడదు. మనం ఎంతైనా వాదించుకోవచ్చు. విభేదాలు ఉండొచ్చు. కుటుంబం అనేది ప్రత్యేకం. వారిని రాజకీయాల్లోకి తీసుకురాకూడదు. - నందమూరి సుహాసిని, హరికృష్ణ కుమార్తె

ముఖ్యమంత్రి నుంచి ప్రకటన కోరుతున్నా

వల్లభనేని వంశీ, కొడాలి నాని, అంంటి రాంబాబు.. వీళ్లంతా నీచాతి నీచంగా మా అత్త(భువనేశ్వరి) గురించి మాట్లాడారు. సిగ్గూ, లజ్జ ఉందా వారికి? ఇది చాలా తప్పు. ముఖ్యమంత్రి నుంచి ప్రకటన కోరుతున్నా. నానీని మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలి. ఇలా జరిగినందుకు మీరూ క్షమాపణ చెప్పాలి. మీ మీడియా సమావేశం కోసం మేం ఎదురుచూస్తున్నాం. నందమూరి తారక రామారావు మహిళలకు ఎంతో గౌరవం ఇచ్చేవారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చాక మహిళలకు ఆస్తి హక్కు ఇచ్చారు. చంద్రబాబు పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి మహిళల్ని వెన్నుతట్టి ప్రోత్సహించారు. హరికృష్ణ మంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీలో మహిళా కండక్టర్లను నియమించారు. ఎన్టీఆర్‌ తీసిన సినిమాల్లోనూ మహిళలకే ప్రాధాన్యం ఇచ్చారు. ఎప్పుడైనా మహిళల్ని వెన్నుతట్టి ప్రోత్సహించాలి. - నందమూరి చైతన్య కృష్ణ, ఎన్టీఆర్‌ మనవడు

వైకాపాలో మహిళల్ని ఎలా గౌరవిస్తారో అర్థమైంది


భువనేశ్వరి కుటుంబ బాధ్యతనే కాకుండా రాజకీయపరంగా కూడా చంద్రబాబుకు ఎంతో మద్దతు ఇస్తున్నారు. మీరెప్పుడైనా మహిళలకు గౌరవం ఇస్తే మీకు అర్థమవుతుంది. అసెంబ్లీలో లేని వ్యక్తుల గురించి మాట్లాడకూడదు. కానీ భువనేశ్వరి పేరెత్తి చంద్రబాబుతో కన్నీరు పెట్టించారు. ఎన్టీఆర్‌ వారసులుగా హెచ్చరిస్తున్నాం. ఇలాంటి చీప్‌ పాలిటిక్స్‌ మానుకోండి.. వైకాపాలో మహిళలు ఎమ్మెల్యేలు, మంత్రి పదవుల్లో ఉన్నారు. మీ నాయకులు ఇలా మాట్లాడుతున్నారంటే ఆ పార్టీలో మహిళలకు ఎలాంటి గౌరవం ఇస్తారో అర్థమైంది. - గారపాటి శ్రీనివాస్‌

వారిని భార్యాపిల్లలు ఎలా భరిస్తున్నారో?

విలువలు లేనివారు మాట్లాడే మాటలివి. వారిని భార్య, పిల్లలు ఎలా భరిస్తున్నారో అర్థం కావట్లేదు. వీరి తీరుతో ప్రజలు భయంతో బతుకుతున్నారు. ఆ భయం పోతే ఈ నాయకులకు దిక్కు దివాణం ఉండదు. ఎలా వచ్చారో, టికెట్‌ ఎలా ఇప్పించుకున్నారో మర్చిపోకండి. నందమూరి కుటుంబంలో ఎంతో మహిళలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు.- కామినేని సీమంతిని

సినీతారల స్పందన...

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరిపై అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేయడాన్ని సినీ ప్రముఖులు ఖండించారు. నోటికొచ్చినట్లు మాట్లాడటం తగదన్నారు. ఈ మేరకు పలువురు తారలు సామాజిక మాధ్యమాల వేదికగా తమ స్పందనను తెలియజేశారు.

పశువుల కంటే హీనంగా..

ప్రజాసమస్యలపై అర్థవంతమైన చర్చలు జరగాల్సిన అసెంబ్లీలో కొందరు సభ్యులు పశువుల కంటే హీనంగా చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరిపై అసభ్య వ్యాఖ్యలు చేయడం దిగ్భ్రాంతికరం. రాజకీయ విమర్శలు.. విధానాలపై ఉండాలి కానీ, కుటుంబ సభ్యులపై అసభ్యంగా మాట్లాడటం క్షమార్హం కాదు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉండటం వల్లే మీ మనుగడ సాగింది. శిశుపాలుడి వంద తప్పులు పూర్తయినట్టు నిన్నటితో మీ వంద తప్పులు పూర్తయ్యాయి. ఇక, మీ అరాచకాన్ని ఉపేక్షించేది లేదు. ప్రతి ఒక్క తెలుగుదేశం సైనికుడు వైకాపా దుశ్శాసనుల భరతం పడతారు. ఇలాంటి స్థాయిలేని వ్యక్తుల మధ్యలో మీరు రాజకీయం చేయాల్సి రావడం దురదృష్టకరం పెదనాన్నా. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మేమంతా మీ వెంటే ఉంటాం. - నారా రోహిత్‌

స్థాయి లేనివారి మాటలకు ఆవేదన చెందక్కర్లేదు

ఏమాత్రం స్థాయి లేని వ్యక్తులు అన్న మాటలకు, కల్పించిన హీనమైన సందర్భాలకు చంద్రబాబు, ఆయన సతీమణి ఎంతమాత్రం ఆవేదన చెందాల్సిన అగత్యం లేదు. నీచ సంస్కృతికి అద్దం పడుతున్న ఈ పనికిమాలిన వారి ప్రమాణాలకు అతీతమైన ఎత్తులో ఉన్న వ్యక్తులు చంద్రబాబు, ఆయన సతీమణి. తెలుగువారు అత్యంత ఆత్మీయంగా అభిమానించే ప్రేమమూర్తులు వాళ్లు.- అశ్వినీదత్‌, ప్రముఖ నిర్మాత

తీవ్ర మనస్తాపానికి గురిచేసింది
తెదేపా అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యుల్ని కించపరిచేలా కొందరు వ్యాఖ్యలు చేయడం బాధాకరమైన విషయం. మీడియా సమావేశంలో ఆయన కంట తడి పెట్టడం తీవ్ర మనస్తాపానికి గురి చేసింది. - రాఘవేంద్రరావు, ప్రముఖ దర్శకుడు

వ్యక్తిగత విమర్శలు తగదు

వ్యక్తిగతంగా దూషించడం అసహ్యకరమైన పని. ఇప్పుడు చంద్రబాబు సతీమణిపై వ్యక్తిగత విమర్శలు చేశారు. ఆమెకు కుటుంబ వ్యవహారాలు, వ్యాపారం తప్ప రాజకీయాలతో సంబంధం లేదు. మీరు వ్యక్తిగత దూషణలు చేయొద్దు. అలాగే తెదేపా వాళ్లు సీఎం జగన్‌ను వ్యక్తిగతంగా తిట్టొద్దు. ఆయన పరిపాలనను విమర్శించండి. ఇది చెత్త సంప్రదాయం. మహిళలపై వ్యక్తిగత విమర్శలు చేయటం తగదు. చంద్రబాబు తన ముఖంలో ఎమోషన్స్‌ను చాలా కంట్రోల్‌ చేసుకుంటారు. కానీ, తొలిసారి కన్నీటి పర్యంతమవటం నాకు చాలా బాధనిపించింది. కుటుంబ సభ్యులను విమర్శిస్తే ఎంత బాధాకరంగా ఉంటుందో మాకు తెలుసు. రాజకీయాల్లో ఉన్న ఎవరినైనా విమర్శించవచ్చు. అయితే అవి వ్యక్తిగతంగా చేయకూడదు. కల్యాణ్‌బాబు ఎప్పుడూ వ్యక్తిగత దూషణలకు వెళ్లలేదు. ఇకకైనా ఈ సంప్రదాయానికి ముగింపు పలకండి. - నాగబాబు, నటుడు, నిర్మాత

రాజకీయాలపై ఏహ్యభావం

తన భార్యను కించపరిచారని, ఆమె గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లేలా మాట్లాడారని చంద్రబాబు కంటతడి పెట్టడం బాధాకరం. ఇలాంటి ఘటనలు సామాన్యులకు రాజకీయ వ్యవస్థపై ఏహ్యభావం కలిగించే ప్రమాదం ఉంది. - బండ్ల గణేశ్‌, నిర్మాత

భువనేశ్వరిపై వైకాపా నేతల అనుచిత వ్యాఖ్యలపై పార్టీ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు, సినీ ప్రముఖులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేపట్టారు. ఇదే సమయంలో నందమూరి కుటుంబం ఉమ్మడిగా మీడియా సమావేశం నిర్వహించి.. భువనేశ్వరికి అండగా ఉంటామంటూ ప్రకటన చేయటం అన్నివర్గాల్లో ఆసక్తిని రేపింది.

ఇదీ చదవండి:

NBK Counter To YCP Leaders: అసెంబ్లీలో ఉన్నామా..? గొడ్ల చావిడిలో ఉన్నామా..?

Last Updated : Nov 21, 2021, 11:31 AM IST

ABOUT THE AUTHOR

...view details