ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి చేసిన జీవోలు 81, 85లను హైకోర్టు కొట్టివేయడం వైకాపా ఒంటెద్దు పోకడలకు చెంప పెట్టు అని మాజీ మంత్రి నక్కాఆనంద్‌బాబు విమర్శించారు. హైకోర్టు చేసిన సవరణలను 3 నెలల క్రితం శాసనమండలిలో తెలుగుదేశం ప్రతిపాదిస్తే తప్పుపట్టారన్న ఆయన... ఇప్పుడు కోర్టు ఆదేశాలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. వాస్తవాలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చినందుకే శాసనమండలి రద్దుకు ప్రతిపాదించారని ఆక్షేపించారు.
11 నెలల కాలంలోనే 55 సార్లు ప్రభుత్వం వ్యవహరించిన తీరును ధర్మాసనం తప్పుపట్టిందని, ఇంత తక్కువ సమయంలో కోర్టులతో మొట్టికాయలు వేయించుకున్న ఏకైక ప్రభుత్వంగా వైకాపా సర్కారు రికార్డుల్లో చోటు సాధించిందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా సీఎం జగన్... చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న నియంతృత్వ పాలనను మానుకోవాలని హితవు పలికారు. న్యాయస్థానాల తీర్పులతోనైనా వైకాపా ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని నక్కా ఆనంద్‌బాబు సూచించారు.