సైబర్ నేరాలకు పాల్పడుతున్న నైజీరియన్లను తెలంగాణలోని సైబరాబాద్ పోలీసులు తరచూ అరెస్టు చేస్తున్నా.. మోసాలకు మాత్రం పూర్తి స్థాయిలో చెక్ పడటం లేదు. కొత్తకొత్త పద్ధతుల్లో నైజీరియన్లు మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. కొన్ని నెలల నుంచి కార్పోరేట్ కంపెనీల అధికారిక మెయిల్స్ హ్యాక్ చేయటం, చరవాణుల సిమ్ స్వాప్ చేయటం వంటి నేరాలకు పాల్పడుతూ కోట్లు కొల్లగొడుతున్నారు.
నైజీరియన్ల నయా మోసాలు... కొత్త పంథాల్లో సైబర్ నేరాలు - నైజీరియన్ల సైబర్ నేరాలు
మీకు లాటరీ వచ్చింది... నగదు ఖాతాలో క్రెడిట్ కావాలంటే బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాలని సందేశాలు. స్పందిస్తే క్రెడిట్ చేసేందుకు ప్రాసెసింగ్ ఫీజు పేరుతో వసూళ్లు.. ఇలా సంబంధంలేని మోసాలు చేస్తూ.. పదిహేనేళ్ల నుంచి పక్కా ప్రణాళికలతో హైదరాబాద్లోని అమాయకులను నైజీరియన్లు దోచేస్తున్నారు. ఎంత మందిని అరెస్టు చేసినా... కొత్తకొత్త మోసాలకు తెరతీస్తూ... తేరుకునేలోపే లక్షలు కాజేస్తున్నారు.
నాలుగైదేళ్ల నుంచి షాదీడాట్‌కాం, మాట్రిమోనియల్ సర్వీస్ లాంటి ఆన్లైన్ వివాహ వేదికల్లో అందమైన యువకుల ఫోటోలు ఉంచి డాక్టర్లు, ఇంజినీర్లు, వ్యాపారవేత్తలుగా పరిచయం చేసుకొని విదేశీ పెళ్లి కొడుకుల పేరుతో మోసం చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదులతో ఇటువంటి కేసుల్లో ఇప్పటివరకు 16 మంది నైజీరియన్లను అరెస్టు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
ప్రముఖ కంపెనీల పేర్లతో లాటరీలు...
ఆఫ్రికా దేశాల నుంచి విద్య, ఉపాధి పేరుతో దక్షిణాఫ్రికా, కెన్యాల నుంచి వస్తోన్న నైజీరియన్లు.. అక్కడి నుంచి ముంబయి, బెంగళూరు, హైదరాబాద్కు వస్తున్నారు. వీరిలో 30 శాతం మంది మాత్రమే ఉన్నత విద్య, వ్యాపారాలు సక్రమంగా చేసుకుంటుండగా.. మిగిలిన వారంతా మోసాలకు పాల్పడుతూ అసాంఘిక కార్యకలాపాలకు చిరునామాగా నిలుస్తున్నారు. తాజాగా ప్రముఖ కంపెనీలైన టయోటా, కోకాకోలా, నికాన్, మెర్సిడెజ్ బెంజ్ లాటరీ పేరుతో మోసాలు చేయడం ప్రారంభించి బాధితుల నుంచి లక్షల్లో స్వాహా చేస్తున్నారని నేరపరిశోధక సంయుక్త కమిషనర్ అవినాశ్ మహంతి వివరించారు.