ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

NAGOBA JATHARA: ఆదివాసీల సంబురం...నాగోబా జాతర

Nagoba Jatara 2022: ఆదివాసీల ఆచారాలన్నీ ప్రకృతితో మమేకమై ఉంటాయి. చెట్టు, పుట్ట, చేను, అడవి చుట్టూ పరిభ్రమిస్తాయి. తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్​ జిల్లాలో నాగోబా జాతర ఆదివాసీలకు ముఖ్య పండుగ. ఇందులో వారి బతుకుచిత్రం ఆవిష్కృతమవుతుంది. భవిష్యత్తు ప్రణాళిక రూపుదిద్దుకుంటుంది.

nagoba jaathara
నాగోబా జాతర

By

Published : Feb 3, 2022, 12:02 PM IST

Nagoba Jatara 2022: తెలంగాణలో ప్రతి ఏటా జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర తర్వాత అత్యంత ప్రజాధరణ పొందిన గిరిజనుల జాతరగా పేరొందింది నాగోబా జాతర. ఈ వేడుక కోసం మెస్రం వంశస్థులు ఎక్కడున్నా ఎడ్లబళ్లపై వచ్చి మర్రిచెట్టు నీడన సేదతీరి, హస్తిన మడుగు నుంచి తెచ్చే జలంతో ఆలయాన్ని అభిషేకించి నాగోబాను ఆరాధిస్తారు. పెళ్లయిన మహిళలు ఇక్కడ బేటి పేరిట మొక్కుతీర్చుకుంటేనే మెస్రం వంశీయుల కోడలిగా గుర్తింపు లభిస్తుంది. ఇక్కడ కర్మకాండ చేస్తేనే చనిపోయినవారికి మోక్షమని ఆదివాసీలు నమ్ముతారు.

ప్రాచుర్యంలో ఉన్న కథ

పూర్వం మెస్రం వంశీయుల్లో ఏడుగురు అన్నదమ్ములు కేస్లాపూర్‌లో ఉండే మేనమామ ఇంటికి బయల్దేరారు. వాళ్లను తన తండ్రి ఆదరించలేదనే కోపంతో చంపేందుకు వస్తున్నారనుకుంది ఆయన కూతురు ఇంద్రాదేవి. దాంతో ఆమె పెద్దపులిగా మారి ఆరుగురిని చంపేసింది. చివరివాడు నాగేంద్రుడిని వేడుకుని తప్పించుకున్నాడు. మెస్రం వంశీయులను కాపాడిన నాగేంద్రుడు నాగోబాగా వెలిశాడని భావించి వేడుక చేసుకున్నారు. అదే నాగోబా జాతర..

అమావాస్యరోజు మహాపూజ

ఏటా పుష్యమాస అమావాస్య అర్ధరాత్రి మహాపూజతో జాతర ఆరంభిస్తారు. అంతకంటే నెల ముందు నియమనిష్టల ప్రస్థానం ప్రారంభమవుతుంది. మెస్రం, గోడం ఆడపడచులు కొత్తకుండల్లో తెచ్చే పవిత్రజలాన్ని తుడుం మోతలు, సన్నాయి స్వరాల మధ్య అందరిపై చిలకరిస్తారు. మర్రిచెట్టునీడన అందరూ తెచ్చిన గట్క (జొన్న సంకటి), సాంబారే నాగోబాకు ప్రత్యేక నైవేద్యం. ఎవరికీ ఎవరూ భారం కాకూడదనేది ఈ నైవేద్య సమర్పణలో అంతర్లీనంగా ఉన్న సూత్రం. ఇప్పటికీ జాతరకు ఎడ్లబళ్లపైనే రావాలన్నది అక్కడ నియమం. ఏడాదికి సరిపడా వంటపాత్రలు, వ్యవసాయ పనిముట్లు జాతరలో కొనుగోలు చేయాలనేది ఆచారం. అమావాస్యనాటి ఈ జాతర వెలుగులు పంచుతుందని, తాము నిష్కల్మషంగా ఉంటే దేవత కాపాడుతుందని నమ్ముతారు. ఏటా జాతరకు వెళ్లి నాగోబా దేవతను పూజించడం వల్ల ఎలాంటి ఆపదలూ రావని, ఏడాదంతా మంచే జరుగుతుందని ఆదివాసీల అచంచల విశ్వాసం. అదే వారిలో ధైర్యస్థైర్యాలను నింపుతోంది.

ఇదీ చూడండి:ముచ్చింతల్‌లో రెండో రోజు రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలు

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ABOUT THE AUTHOR

...view details