సీనియర్ నేత, తెరాస ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నివాసంలో తుది శ్వాస విడిచారు. తెల్లవారుజామున ఐదున్నర గంటల సమయంలో నోముల నర్సింహయ్య అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తీసుకెళ్లగా... అప్పటికే మృతి చెందారని వైద్యులు తెలిపారు.
నోముల ప్రస్థానం
ప్రస్తుతం నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు నోముల. 1956 జనవరి 9న నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం పాలెంలో జన్మించారు. గతంలో సీపీఐ(ఎం) నుంచి నకిరేకల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎన్నికయ్యారు..1999,2004 లో సీపీఎం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన.. అసెంబ్లీలో అనేక సమస్యలను లేవనెత్తారు. 2013లో నోముల నర్సింహయ్య తెరాసలో చేరారు. సుదీర్ఘకాలం వామపక్ష ఉద్యమాల్లో పని చేశారు.. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యునిగా కొనసాగారు.. సీపీఎం శాసనససభపక్షనేతగా కూడా పని చేశారు.
న్యాయవాది నుంచి ఎమ్మెల్యే
నర్సింహయ్య అసెంబ్లీలో సమస్యలు ప్రస్తావిస్తూ.. మధ్యలో సామెతలు జోడిస్తూ చేస్తూ ప్రసంగం అందరినీ ఆకట్టుకునేది.. 2009 భువనగిరి ఎంపీగా పోటీచేసి ఓటమి పాలయ్యారు.. కొన్ని వ్యక్తిగత కారణాలతో సీపీఎం పార్టీకి వీడ్కోలు చెప్పిన ఆయన.. 2014లో తెరాస పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో నాగార్జునసాగర్ శాసనసభ నియోజకవర్గంలో ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిపై పోటీచేసి పరాజయం పాలయ్యారు. మళ్లీ 2019లో జరిగిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు.. న్యాయవాది అయిన నర్సింహయ్య నల్లకోటు ధరించి కోర్టులో వివిధ కేసుల విచారణ గతంలో చేపట్టి విధులు నిర్వర్తించారు.