Naga Ramakrishna: ‘‘సారీ బాస్ నన్ను క్షమించు. నేను ఒక వీడియో చేసి పెట్టాను. నా కార్ డ్యాష్ బోర్డులో ఉంది. నా కార్యక్రమాలన్నీ అయిపోయాక ఒకసారి ఫోన్ (7474 అన్‌లాక్) ఓపెన్ చేసి వీడియో చూసి, తర్వాత అందిరికీ పంపు. నా కారు తాళం బాత్‌రూం పైన ఉంది. నీకు మాత్రమే చెబుతున్నా.. ఓకే’’ ఇవీ తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన పాల్వంచలో కుటుంబం ఆత్మహత్య ఘటనలో బాధితుడు నాగ రామకృష్ణ చివరి మాటలు. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి బలవన్మరణానికి పాల్పడటానికి గల కారణాలు, కారకులపై సెల్ఫీ వీడియోల్లో పేర్కొన్న రామృకృష్ణ, ఈ విషయాన్ని బాహ్య ప్రపంచంలోకి తీసుకొచ్చేందుకు మిత్రుడి సహకారం తీసుకున్నారు. ఆ మేరకు స్నేహితునికి వాయిస్ రికార్డు పంపారు. దాని ఆధారంగానే తాము పలు ఆధారాలు సేకరించినట్టు పోలీసులు ఏడు పేజీల రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. దాన్ని న్యాయస్థానంలో సమర్పించారు. దర్యాప్తు సాగిన తీరును న్యాయస్థానానికి వివరించారు.
Palvancha family suicide: ‘‘తాను కుటుంబం సహా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం వనమా రాఘవతోపాటు తన తల్లి మండిగ సూర్యవతి, సోదరి కొమ్మిశెట్టి మాధవిలేనని బాధితుడు నాగ రామకృష్ణ ఆత్మహత్య లేఖలో పేర్కొన్నాడు. తొలుత పాల్వంచ పట్టణ ఎస్సై ఆధ్వర్యంలో, తర్వాత పాల్వంచ ఏఎస్పీ నేతృత్వంలో కేసుకు సంబంధించిన దర్యాప్తు ప్రారంభించాం. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రామకృష్ణ కుమార్తె సాయి సాహితి వాంగ్మూలాన్ని న్యాయమూర్తి సమక్షంలో నమోదుచేశాం. రామకృష్ణ బావమరిది పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 302, 307, 306, ఐపీసీ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాం. రామకృష్ణ స్నేహితుడు ఫోన్‌కు వచ్చిన ఆడియో సందేశం ఆధారంగా సంఘటనా స్థలంలో కీలక ఆధారాలు సేకరించాం. క్లూస్ టీంను రంగంలోకి దించి మరిన్ని సాక్ష్యాధారాలూ సేకరించాం. మృతుడి కారులో ఉన్న ఒక పేజీ ఆత్మహత్య లేఖ, మరో ఏడు పేజీలతో కూడిన అప్పుల తాలూకూ కాగితాలు స్వాధీనం చేసుకున్నాం. వీటితోపాటు 34 నిమిషాల సెల్ఫీ వీడియో కలిగిన ఫోన్‌ను సీజ్ చేశాం. ఈ కేసులో ఏ2గా ఉన్న వనమా రాఘవ బాధితుడిని బెదిరించినట్లు పూర్తి ఆధారాలు అందులో ఉన్నాయి. రాఘవకు బెయిల్ లభిస్తే తనకున్న రాజకీయ పలుకుబడితో కేసును నీరుగార్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో కేసులో సాక్ష్యుల ప్రాణాలకూ ప్రమాదం జరిగే అవకాశం ఉంది’’ అని రిమాండ్ నివేదికలో పేర్కొన్నారు. రిమాండ్ రిపోర్టుతోపాటు రాఘవపై గతంలో అధికారికంగా నమోదైన 11 కేసుల తాలూకు వివరాలనూ న్యాయస్థానానికి సమర్పించారు. పాల్వంచ పట్టణంలో 5, కొత్తగూడెం మూడో పట్టణ ఠాణాలో 3, పాల్వంచ గ్రామీణ పీఎస్‌లో 2, లక్ష్మీదేవిపల్లిలో ఒక కేసు నమోదై ఉన్నట్లు తెలిపారు. భద్రాచలం సబ్ జైల్‌లో ఉన్న వనమా రాఘవేందర్‌రావును విచారణ నిమిత్తం జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.