Munugode By Election: ఏడాదిలోపు శాసనసభ ఎన్నికలు. తెలంగాణ రాష్ట్ర వేదికగా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు సిద్ధమైన అధికార పార్టీ. ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకునేందుకు వ్యూహాలు పన్నుతున్న భాజపా. చావో రేవో తెల్చుకునేందుకు సిద్ధమైన కాంగ్రెస్. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో వచ్చిన మునుగోడు ఉపఎన్నిక రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. ఆ పార్టీని వీడటం, ఎమ్మెల్యే పదవికి రాజీనామాతో ఉపఎన్నిక అనివార్యమైంది. ప్రధాన పార్టీల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికగా మునుగోడు పోరును రాజకీయ పార్టీలు ఛాలెంజ్ తీసుకుంటున్న తరుణంలో.. గెలుపే లక్ష్యంగా ఎవరికి వారు తొలి నుంచి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఉపఎన్నికను సవాల్‌గా తీసుకున్న తెరాస.. ఎనిమిదన్నరేళ్లుగా అధికారంలో ఉండి... తిరుగులేని విజయాలు సొంతం చేసుకున్న తెరాస... అనంతరం వచ్చిన జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజురాబాద్ ఫలితాలతో నిరాశకు గురయ్యే పరిస్థితి వచ్చింది. ఈ ఎదురుదెబ్బలను విశ్లేషించుకున్న గులాబీ పార్టీ.. ప్రత్యర్థులకు ఏ చిన్న అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడుతోంది. రాష్ట్రంలో బలపడుతున్న భాజపా, జాతీయ రాజకీయాల్లో అడుగుపెడుతున్న సందర్భంలో మునుగోడు ఉపఎన్నిక తెరాసకు సవాల్‌గా మారింది. సీఎం కేసీఆర్ ఇమేజ్, ప్రభుత్వ సంక్షేమ పథకాలనే ప్రధానంగా నమ్ముకొని బరిలోకి దిగుతున్న ఆ పార్టీ ఇప్పటికే తెరాస దాదాపు అన్ని గ్రామాల్లో ఒక విడత ప్రచారాన్ని పూర్తి చేసింది. ఆత్మీయ సమ్మేళనాలు, దళిత వాడల్లో సహపంక్తి భోజనాలు వంటి కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లింది. కేటీఆర్, హరీశ్ రావు సహా 86 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు త్వరలోనే నియోజకవర్గంలో దిగనున్నారు.
సుమారు 2వేల ఓటర్లకు ఒక కీలక నేతకు బాధ్యత అప్పగించారు. తెరాస పేరు మార్పు, భారాస ప్రకటన అంశంపై ఇప్పటి వరకు నిమగ్నమైన కేసీఆర్.. ఇక పోలింగ్ ముగిసే వరకు మునుగోడుపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. గతంలో మునుగోడులో సభ నిర్వహించిన కేసీఆర్.. ప్రచార గడువు ముగిసే ఒకటి, రెండు రోజుల ముందు చండూరులో భారీ సభ పెట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేశారు. సర్వేలు అనుకూలంగా ఉన్నప్పటికీ... ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయకుండా చివరి వరకు అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. వామపక్షల పొత్తు మునుగోడులో కచ్చితంగా లాభం చేకూరుస్తుందనే ఆశతో గులాబీ పార్టీ ఉంది. సీపీఐ, సీపీఎం ఓట్లన్నీ తెరాసకే బదిలీ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెరాస, వామపక్షాల నేతలతో గ్రామస్థాయి నుంచి సమన్వయ కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు.